Harsh Goenka: బంగారమా? షేర్లా? ఏది బెస్ట్.. గోయెంకా పోస్ట్‌కు నెటిజన్ దిమ్మతిరిగే కౌంటర్!

Harsh Goenkas Gold Investment Post Gets Unexpected Reply
  • బంగారం ధరల పెరుగుదలపై ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా పోస్ట్
  • కిలో బంగారంతో ఏయే కాలంలో ఏ కారు కొనొచ్చో సరదా పోలిక
  • 2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనొచ్చంటూ గోయెంకా చమత్కారం
  • బంగారం కన్నా షేర్ల పెట్టుబడే లాభదాయకమన్న నెటిజన్
  • సియెట్ షేర్ల లాభాలను ఉదాహరిస్తూ అదిరిపోయే కౌంటర్
సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పెట్టుబడులపై ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బంగారం ధరల పెరుగుదలను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌కు ఒక నెటిజన్ ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆలోచింపజేస్తోంది. బంగారం కంటే సరైన షేర్లలో పెట్టుబడి పెట్టడమే ఉత్తమమనే వాదనకు బలం చేకూర్చుతోంది.

వివరాల్లోకి వెళితే... సియెట్ టైర్ల సంస్థతో పాటు పలు కంపెనీలకు అధిపతి అయిన ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా, ఇటీవల 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలను ప్రస్తావిస్తూ, 1980ల నుంచి ఇప్పటివరకు కిలో బంగారం విలువతో ఏయే కార్లు కొనవచ్చో పోల్చారు. ఇదే ఒరవడి కొనసాగితే, 2030 నాటికి కిలో బంగారంతో రోల్స్ రాయిస్ కారు, 2040 నాటికి ఏకంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా కొనుగోలు చేయవచ్చని చమత్కరించారు. "ఒక కిలో బంగారం దాచుకోండి" అంటూ ఆయన సరదాగా సలహా ఇచ్చారు.

గోయెంకా పోస్ట్‌కు చాలా మంది నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే, ఒక నెటిజన్ మాత్రం భిన్నమైన కోణంలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. బంగారం పెట్టుబడి కన్నా, గోయెంకాకు చెందిన సియెట్ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చేదో లెక్కలతో సహా వివరించారు.

"2000 సంవత్సరంలో కిలో బంగారం ధర సుమారు రూ. 4.4 లక్షలు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయలు దాటింది. అదే సమయంలో, ఆ రూ. 4.4 లక్షలను సియెట్ కంపెనీ షేర్లలో పెట్టుబడిగా పెట్టి ఉంటే, వాటి విలువ ఇప్పుడు సుమారు రూ. 4.5 కోట్లకు చేరేది" అని ఆ నెటిజన్ తన రిప్లైలో పేర్కొన్నారు. ఈ పోలికతో గోయెంకా వ్యాఖ్యలకు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారం, స్టాక్ మార్కెట్లలో ఏ పెట్టుబడి మార్గం ఉత్తమమనే అంశంపై నెటిజన్ల మధ్య విస్తృత చర్చ జరుగుతోంది.
Harsh Goenka
Harsh Goenka gold
RPG Group
Ceat tyres
gold price
stock market
investment
share market
gold vs shares
investment options

More Telugu News