Balakrishnan Rajagopal: కన్నీటి గాజా... అంతా హృదయవిదారకం... ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి బాలకృష్ణన్ రాజగోపాల్ ఏం చెప్పారంటే...!

Balakrishnan Rajagopal on Gaza situation heartbreaking
  • గాజాలో 92% ఇళ్లు ధ్వంసం
  • ఇళ్ల విధ్వంసాన్ని 'డోమిసైడ్'గా అభివర్ణించిన రాజగోపాల్
  • రెండు సంవత్సరాల యుద్ధంలో 67,700 మందికి పైగా మృతి
రెండేళ్ల భీకర యుద్ధం తర్వాత కాల్పుల విరమణతో గాజాలో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంటోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే, అక్కడ వారికి స్వాగతం పలుకుతున్నవి శిథిలాల గుట్టలు మాత్రమే. ఈ హృదయవిదారక పరిస్థితుల నేపథ్యంలో, నిరాశ్రయులైన ప్రజలకు తక్షణమే టెంట్లు, కారవాన్‌లను అనుమతించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిపుణుడు ఒకరు ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేశారు.

సరైన నివాసం పొందే హక్కుపై ఐరాస ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణన్ రాజగోపాల్ 'అల్ జజీరా'తో మాట్లాడుతూ గాజాలోని వాస్తవ పరిస్థితులను వివరించారు. ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేసిన ఉత్తర గాజా ప్రాంతాలకు తిరిగి వెళుతున్న ప్రజలకు వారి ఇళ్లు, పరిసరాలు పూర్తిగా ధ్వంసమై కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. "వారి మానసిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన గాయం నుంచి వారు కోలుకోవడం కష్టం" అని ఆయన తెలిపారు.

2023 అక్టోబరులో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 67,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, గాజాలోని నివాస భవనాల్లో ఏకంగా 92 శాతం దెబ్బతినడమో లేదా పూర్తిగా నాశనం అవడమో జరిగాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు టెంట్లు, తాత్కాలిక షెల్టర్లలో జీవనం సాగించాల్సి వస్తోంది. 

వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలోనే కాల్పుల విరమణ సమయంలో గాజాకు టెంట్లు, కారవాన్‌లు పంపాల్సి ఉన్నా, ఇజ్రాయెల్ కఠినమైన దిగ్బంధనం కారణంగా దాదాపు ఏవీ లోపలికి రాలేదని రాజగోపాల్ గుర్తుచేశారు.

"ప్రస్తుతం ఇదే అసలు సమస్య. గాజాలోకి ప్రవేశ మార్గాలన్నింటినీ ఇజ్రాయెల్ నియంత్రించడం ఆపే వరకు తక్షణ సహాయం కూడా సాధ్యం కాదు" అని ఆయన స్పష్టం చేశారు. గాజాలో ఇళ్ల విధ్వంసాన్ని ఆయన 'డోమిసైడ్' (గృహహననం)గా అభివర్ణించారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న జాతి నిర్మూలనలో ఇళ్లను నాశనం చేయడం ఒక ప్రధాన భాగమని అన్నారు. "ఇళ్లను కూల్చి, ప్రజలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యం కాకుండా చేయడం ద్వారానే మారణహోమం జరిగింది" అని ఆయన అన్నారు. గాజా కోలుకోవడానికి కొన్ని తరాలు పడుతుందని, ఇది మరో 'నక్బా' (1948 నాటి పాలస్తీనా వలసలు) లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. 
Balakrishnan Rajagopal
Gaza
UN
United Nations
Israel
Palestine
Gaza war
Nakba
domicide
refugees

More Telugu News