Telangana Government: ఆ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ లేఖ

Telangana requests Centre to halt AP on Polavaram project
  • పోలవరం - బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో లేఖ రాసిన తెలంగాణ
  • బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో వెల్లడి
  • టెండర్, భూసేకరణ విషయంలో ముందుకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి
పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జల శక్తి కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు.

డీపీఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా, నిబంధనలు మరియు విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు.

ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం - బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నిలువరించాలని, టెండర్ ప్రక్రియ మరియు భూసేకరణ విషయంలో ముందుకు వెళ్లకుండా చూడాలని కోరారు.
Telangana Government
Polavaram project
Banacharla Link project
Andhra Pradesh

More Telugu News