Sundar Pichai: విశాఖలో గిగావాట్ స్కేల్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ హబ్... సుందర్ పిచాయ్ కీలక ప్రకటన

Sundar Pichai Announces Google AI Hub in Visakhapatnam
  • విశాఖపట్నంలో గూగుల్ మొట్టమొదటి ఏఐ హబ్ ఏర్పాటు
  • గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అధికారికంగా వెల్లడి
  • కొత్తగా అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన వసతులు
  • భారత్‌లో ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యం
టెక్నాలజీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖపట్నానికి భారీ గుర్తింపు లభించనుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, తమ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. భారతదేశంలో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కీలక ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సుందర్ పిచాయ్, "విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ తొలి ఏఐ హబ్ ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ జరిగింది ఒక చారిత్రాత్మక పరిణామం" అని పేర్కొన్నారు. ఈ హబ్ కేవలం ఒక కార్యాలయంగా కాకుండా, అత్యంత శక్తివంతమైన సాంకేతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించారు.

ఈ ఏఐ హబ్ ద్వారా గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలను ఒకేచోట అనుసంధానించనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా గూగుల్ తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు, వినియోగదారులకు మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, ఆర్థిక వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక స్థానాన్ని సంపాదించుకోనుంది.
Sundar Pichai
Google AI Hub
Visakhapatnam
Andhra Pradesh
Artificial Intelligence India
AI Innovation
Narendra Modi
Gigawatt Scale
Tech Investment India
Subsea Gateway

More Telugu News