AP-Google: ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి... విశాఖ ఏఐ హబ్ పై గూగుల్ కీలక ప్రకటన

Google to Invest 133000 Crore in Visakhapatnam AI Hub Says Thomas Kurian
  • విశాఖలో భారీ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం
  • ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రణాళిక
  • అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం
  • ప్రపంచాన్ని కనెక్ట్ చేసేలా సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్
  • విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మార్చడమే లక్ష్యం
  • ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రక ఒప్పందం
ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,33,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం.

ఈ చరిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా థామస్ కురియన్ మాట్లాడుతూ... "భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ను ప్రారంభిస్తున్నాం. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుతాం" అని తెలిపారు. ఈ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్లు వివరించారు.

ఈ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను (టీపీయూ) వాడతామని, ఇవి ఏఐ ప్రాసెసింగ్‌కు రెట్టింపు వేగాన్ని అందిస్తాయని కురియన్ పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ వంటి ఎన్నో సేవలను ఇకపై భారత్ నుంచే ప్రపంచానికి అందించే అవకాశం కలుగుతుందన్నారు. "ఈ హబ్ ద్వారా కేవలం టెక్నాలజీని అందించడమే కాకుండా, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో ఇది మా భాగస్వామ్యం" అని ఆయన అన్నారు.

AP-Google
Thomas Kurian
Google
Visakhapatnam
AI Hub
Artificial Intelligence
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu Naidu
India AI
Google Cloud

More Telugu News