Maria Corina Machado: మరియాకు నోబెల్ ప్రకటనపై మండిపడ్డ వెనెజువెలా అధ్యక్షుడు.. ఏంచేశారంటే..!

Venezuela President Furious Over Maria Machado Nobel Announcement
  • నోబెల్ కమిటీపై వెనెజువెలా అధ్యక్షుడు మదురో ఆగ్రహం
  • నార్వేలో వెనెజువెలా రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటన
  • మదురో నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి
తమ పౌరుడికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ఏ దేశ ప్రభుత్వమైనా సంతోషిస్తుంది. సదరు బహుమతి గ్రహీతను సత్కారాలతో ముంచెత్తుతుంది. కానీ, వెనెజువెలా మాత్రం నోబెల్ కమిటీపై మండిపడుతోంది. నార్వేపై ప్రతీకారచర్యలకు పూనుకుంది. ఏకంగా నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను నోబెల్ అవార్డుల కమిటీ ఈ ఏడాది శాంతి పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న మచాడోను అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేయడంతో నోబెల్ కమిటీపై, నార్వేపై ఆయన మండిపడుతున్నట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా నార్వేలోని తమ దేశ రాయబార కార్యాలయం మూసివేయాలని ఆదేశించారని తెలుస్తోంది. అయితే, ఈ వివరాలేవీ అధికారికంగా బయటకు వెల్లడించలేదు. మచాడోకు నోబెల్ ప్రకటించడంపై వెనెజువెలా ప్రభుత్వం అసలు స్పందించనే లేదు. ఈ క్రమంలోనే వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెడుతూ.. దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా నార్వేలోని తమ రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు వెల్లడించింది.

దీంతోపాటు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియాలోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, రాయబార కార్యాలయం మూసివేయాలన్న వెనెజువెలా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ.. వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. నోబెల్‌ బహుమతి ప్రకటనలలో నార్వే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని, నార్వేజియన్ నోబెల్ కమిటీ స్వతంత్రంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుందని వివరణ ఇచ్చింది.
Maria Corina Machado
Venezuela
Nobel Peace Prize
Nicolas Maduro
Norway
Embassy closure
Venezuela politics
Norway relations
Political conflict
International relations

More Telugu News