Rahul Gandhi: ఇది దళితుల సమస్య.. ఐపీఎస్ పూరన్ కుమార్ మృతిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi Comments on IPS Pooran Kumar Death
  • ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
  • ప్రణాళికాబద్ధంగా ఆయన కెరీర్‌ను దెబ్బతీశారని విమర్శ
  • ఇది కుటుంబ సమస్య కాదు, దళితుల సమస్య అని వ్యాఖ్య
  • ప్రధాని మోదీ, సీఎం సైనీ వెంటనే స్పందించాలని డిమాండ్
  • నిష్పక్షపాత విచారణ జరిపించడంలో హర్యానా సీఎం విఫలమయ్యారని విమర్శ
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతి వెనుక ప్రభుత్వ వివక్ష ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానాలో పూరన్ కుమార్ నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరన్ కుమార్ మరణం కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదని, ఇది దళితుల సమస్య అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఆయనపై ప్రణాళికాబద్ధంగా వివక్ష చూపిందని, ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసి కెరీర్‌ను నాశనం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిష్పక్షపాత విచారణ జరిపించడంలో సీఎం సైనీ పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

చనిపోయిన తర్వాత కూడా తన భర్తకు సరైన గౌరవం దక్కలేదని పూరన్ కుమార్ భార్య తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఈ నెల‌ 7న తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
Rahul Gandhi
Pooran Kumar
Haryana
IPS officer
Dalit issue
Nayab Singh Saini
Narendra Modi
Government discrimination
Suicide case

More Telugu News