ఏపీలో 'గూగుల్ ఏఐ హబ్'.. చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం
- విశాఖలో గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు
- రూ.88,628 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న టెక్ దిగ్గజం
- ఏపీ ప్రభుత్వంతో ఢిల్లీలో అవగాహన ఒప్పందం
- 1.88 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అంచనా
- భారత్‌లోనే తొలి 'గూగుల్ ఏఐ హబ్' విశాఖలో ప్రారంభం
- సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందాల మార్పిడి
ఈ ఒప్పందం ద్వారా గూగుల్ సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.88,628 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కేంద్రం, భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే తదితరులు పాల్గొన్నారు.
లక్షల ఉద్యోగాలు.. రాష్ట్రానికి ఆదాయం
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరవచ్చని భావిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం పూర్తిస్థాయి ‘ఏఐ సిటీ’గా రూపాంతరం చెందనుంది.
గతేడాది అక్టోబర్‌లో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలే ఈ ఒప్పందానికి పునాది వేశాయి. ఈ డేటా సెంటర్‌తో పాటు విద్యుత్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.