Hariram: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ హరిరామ్ ఆస్తుల సీజ్

Kaleshwaram Project Ex ENC Hariram Assets Seized
  • ఆస్తుల క్రయవిక్రయాలు నిషేధిస్తూ నోటిఫికేషన్
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ చర్యలు
  • హరిరామ్ పర్యవేక్షణలో రూ.48,665 కోట్ల కాళేశ్వరం పనులు
  • మరో ఇంజనీర్ నికేశ్ కుమార్ ఆస్తులు కూడా జప్తు
  • సిద్దిపేటలో 28 ఎకరాల భూమి సహా పలు ఆస్తులు సీజ్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ మాజీ ఎండీ బి. హరిరామ్‌కు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆయన పేరిట ఉన్న ఇతర ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. దీంతో ఈ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం ఉండదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్‌ను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఏసీబీ అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు లేఖ రాసి, ఆస్తుల క్రయవిక్రయాలను పూర్తిగా నిలిపివేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు రూ.48,665 కోట్ల విలువైన పనులకు హరిరామ్ పర్యవేక్షకుడిగా వ్యవహరించడం గమనార్హం. ప్రాజెక్టులోని 4, 5, 6 లింకుల పరిధిలో జరిగిన పనులన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ పనుల అంచనా వ్యయం తొలుత రూ.41,568 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత అది భారీగా పెరిగింది. 2024 ఏప్రిల్‌లో హరిరామ్ నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నికేశ్ కుమార్ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌లో పేర్కొంది. రికార్డుల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.17.73 కోట్లు ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌పై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజిలెన్స్ కమిషన్‌కు ఫైలు పంపించారు.
Hariram
Kaleshwaram project
Telangana
assets case
corruption
ACB
Nikesh Kumar
irrigation department
disproportionate assets
seized assets

More Telugu News