Rehman: సైదాబాద్ జువైనల్ హోంలో దారుణం.. బాలుడిపై సూపర్‌వైజర్ లైంగిక దాడి

Staff Gaurd Arrested for Sexually Assaulting Boy in Hyderabad Juvenile Home
  • సూపర్‌వైజర్ రెహమాన్‌ అఘాయిత్యం
  • దసరా పండుగకు ఇంటికెళ్లడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదు
  • దాడి నిజమేనని తేల్చిన విచారణాధికారి
  • మరికొందరు బాధితులు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు
 రక్షణ కల్పించాల్సిన చోటే ఓ బాలుడి జీవితం నరకప్రాయంగా మారింది. హైదరాబాద్‌లోని సైదాబాద్ జువైనల్ హోంలో బాలుడిపై అక్కడి స్టాఫ్ గార్డ్ (సూపర్‌వైజర్) రెహమాన్ (27) పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా పండుగ సెలవుల సందర్భంగా తల్లి ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లడంతో ఈ దారుణం బయటపడింది.

2024 సెప్టెంబరు నుంచి బాధిత బాలుడు జువైనల్ హోంలో ఉంటూ చదువుకుంటున్నాడు. దసరా సెలవులు ముగిశాక తిరిగి హోంకు వెళ్లేందుకు బాలుడు నిరాకరించాడు. తల్లి గట్టిగా నిలదీయడంతో మార్చి నెల నుంచి సూపర్‌వైజర్ రెహమాన్ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. హోంలోని మూడో అంతస్తు గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు బాధితుడు తల్లికి వివరించాడు.

కుమారుడి మాటలతో ఉలిక్కి పడిన తల్లి శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుడు రెహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హోంలో మరికొందరు బాలురపై కూడా రెహమాన్ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఉండవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దాడి వాస్తవమేనని నిర్ధారణ
ఈ ఘటనపై విచారణాధికారిగా నియమితులైన మైథిలి బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని ధ్రువీకరించారు. సిబ్బందిని, పిల్లలను విచారించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని, నిందితుడిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. జువైనల్ హోం సూపరింటెండెంట్ అఫ్జల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు తమ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Rehman
Saidabad Juvenile Home
Hyderabad
POCSO Act
Sexual Assault
Juvenile Justice
Child Abuse
SC ST Atrocity Act
Crime News
Telangana

More Telugu News