Shashi Tharoor: ఈజిప్టు సదస్సుకు మోదీ దూరంగా ఉండటంపై శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shashi Tharoor Comments on Modis Absence at Egypt Summit
  • గాజా యుద్ధంపై ఈజిప్టులో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి సదస్సు
  • సదస్సుకు అమెరికా, పాలస్తీనా అధ్యక్షులు సహా 20 దేశాల అధినేతల హాజరు
  • భారత్ నుంచి ప్రధానికి బదులుగా సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
గాజా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఈజిప్టులో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి బదులుగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 20 దేశాల అధినేతలు పాల్గొంటున్న ఈ కీలక సమావేశానికి ప్రధాని స్వయంగా హాజరుకాకపోవడం గందరగోళానికి గురిచేస్తోందని ఆయన అన్నారు.

ఈ అంశంపై తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో థరూర్ స్పందిస్తూ, "ఇది వ్యూహాత్మక సంయమనమా? లేక చేజారిన అవకాశమా?" అని ప్రశ్నించారు. మన పొరుగు ప్రాంతంలో జరుగుతున్న ఇంతటి ముఖ్యమైన భద్రతా సదస్సుకు ప్రధాని మోదీ వెళ్లకపోవడం తనను అయోమయానికి గురిచేసిందని పేర్కొన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే అధినేత కీర్ స్టామర్ వంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతున్నారని, అలాంటి సమయంలో భారత్ నుంచి ప్రధాని స్థాయి వ్యక్తి వెళ్లకపోవడం సరైన సంకేతాలు పంపదని అభిప్రాయపడ్డారు.

"ఇది సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించడం కాదు. కానీ ఇంతమంది అగ్రనేతలు హాజరైనప్పుడు, మన ప్రాతినిధ్యం కూడా అదే స్థాయిలో ఉండాలి. లేదంటే, మనం వ్యూహాత్మక దూరం పాటిస్తున్నామనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది" అని గతంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన థరూర్ వివరించారు.

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా షర్మ్ ఎల్-షేక్ నగరంలో ఈ శాంతి సదస్సును నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్-గాజా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఇటీవలే హమాస్ 20 మంది బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడంతో ఈ సదస్సుకు ప్రాధాన్యత పెరిగింది.

కాగా, కొద్దికాలంగా ప్రధాని మోదీ, ఆయన పరిపాలనపై ప్రశంసలు కురిపిస్తున్న థరూర్.. ఇప్పుడు విదేశాంగ విధానంపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీతో ఆయన సంబంధాలు అంత సజావుగా లేవన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, తాను బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తలను థరూర్ ఇప్పటికే పలుమార్లు ఖండించిన విషయం తెలిసిందే.
Shashi Tharoor
Egypt Summit
Narendra Modi
Gaza War
Palestine
Israel
Kirti Vardhan Singh
Mahmoud Abbas
Abdel Fattah el-Sisi
Indian Foreign Policy

More Telugu News