Narendra Modi: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కర్నూలులో మంత్రుల సమీక్ష

Narendra Modi Kurnool Meeting Arrangements Reviewed by Ministers
  • 16న కర్నూలులో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • వేగవంతంగా భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు
  • ఏర్పాట్లు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న 9 మంది మంత్రులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సభను విజయవంతం చేయడానికై తొమ్మిది మంది మంత్రులు దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్‌లు నిన్న అధికారులతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

ప్రధాని కార్యక్రమ ప్రత్యేకాధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పలు విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు నన్నూరులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ వద్ద క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు.

సభకు సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేదిక, పార్కింగ్, తాగునీరు, వర్షపు పరిస్థితుల్లో కూడా భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. వర్షాలు వచ్చినా ఇబ్బంది కలగకుండా మూడు భారీ జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక మధ్య టెంట్‌లో ఉండగా, వేదికకు దూరంగా కూర్చున్నవారు కూడా స్పష్టంగా చూడగలిగేలా పలు ఎల్ఈడీ తెరలు అమర్చనున్నారు.

సభా ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు రాకపోకలకు సౌలభ్యం కోసం సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో ఏపీ మారీటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ముఖ్యమంత్రి కార్యక్రమాల కన్వీనర్ సత్యనారాయణ రాజు, రాష్ట్ర నాయకులు కిలారు రాజేశ్, బి.వి. వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రధాని సభకు తరలివచ్చే ప్రజల రాకపోకల కోసం మొత్తం 7,800 బస్సులు సిద్ధం చేశారు. అందులో ఆర్టీసీ 3,300 బస్సులు కేటాయించింది. 
Narendra Modi
Kurnool
Prime Minister Modi
AP Politics
TG Bharat
BC Janardhan Reddy
Andhra Pradesh
Public Meeting
2024 Elections
Ragamayuri Green Hills

More Telugu News