AP Agreement with Google: ఏపీ దశ మార్చే ఒప్పందం.. ఢిల్లీలో నేడు కీలక ఘట్టం

AP Agreement with Google in Delhi Today
  • విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్, ఏఐ హబ్
  • రూ.88,628 కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం
  • నేడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం
  • సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో సంతకాలు
  • దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు
  • రాష్ట్రంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ఆర్థిక స్వరూపాన్ని మార్చే దిశగా ఒక చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్ల) భారీ వ్యయంతో హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు, దేశంలోనే తొలి 'గూగుల్ ఏఐ హబ్' ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై మంగళవారం ఢిల్లీలో సంతకాలు జరగనున్నాయి.

ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇదే అతిపెద్దదిగా నిలవనుండటం విశేషం.

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబర్‌లో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030 మధ్య) ఈ పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.

'ఏఐ సిటీ'గా మార‌నున్న‌ విశాఖ నగరం 
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం 'ఏఐ సిటీ'గా మారనుంది. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ గ్లోబల్ హబ్‌గా ఎదగనుంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు వల్ల 2028-2032 మధ్య కాలంలో ఏటా రాష్ట్ర జీఎస్‌డీపీకి రూ.10,518 కోట్లు చేకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన సింగిల్ విండో క్లియరెన్స్, మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా సమకూర్చేందుకు ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్ బోర్డు, ఐటీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
AP Agreement with Google
Chandrababu
Andhra Pradesh
Google
AI Hub
Visakhapatnam
Nara Lokesh
AP Economic Development Board
Artificial Intelligence
Data Center
FDI Investment

More Telugu News