Lavau Sri Krishna Devarayalu: ఏపీ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. బియ్యం సేకరణ పెంపు

Lavau Sri Krishna Devarayalu Announces Increased Rice Procurement for AP Farmers
  • ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చిందన్న లావు శ్రీకృష్ణదేవరాయలు
  • రైతుకు కనీస మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  •  14 లక్షల టన్నుల బియ్యాన్ని 10 % బ్రోకెన్ తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఏపీ
ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు వెల్లడించారు. విజయవాడ నగరంలోని పటమట యనమలకుదురు రోడ్డులో ఉన్న భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో, భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం చైర్మన్, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా చైర్మన్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను రైతులకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 15.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10 శాతం బ్రోకెన్‌తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు.

గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచిందన్నారు. గత రబీ సీజన్‌లో 9.93 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని, దాంతో పంట దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో గిడ్డంగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేస్తే, కొత్త వాటిని భారత ఆహార సంస్థ నిర్మించేందుకు తమ సంసిద్ధతను ఆయన తెలియజేశారు. భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో సోలార్ విద్యుత్ కు 45 మెగా వాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లానెల్స్ పెట్టుకోగల అవకాశం ఉందని వివరించారు.

పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ: భారత ఆహార సంస్థ ద్వారా ప్రతి నెలా 1.54 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ అవుతుందని తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్‌ను రాష్ట్రంలో 24.47 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద, మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

తొలుత నిర్వహించిన సమీక్షా సమావేశంలో భారత ఆహార సంస్థ కొనుగోలు, నిల్వ, పంపిణీ కార్యకలాపాలపై కమిటీ సభ్యులు, అధికారులతో చైర్మన్ చర్చించారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం కల్పించేలా, ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా సమీక్షించారు.

ఈ కమిటీ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ రీజనల్ జనరల్ మేనేజర్ విజయ కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ అధికారులు, భారత ఆహార సంస్థ అధికారులు, భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
Lavau Sri Krishna Devarayalu
AP farmers
Andhra Pradesh
rice procurement
Food Corporation of India
kharif season
MSP
fortified rice
civil supplies
AP government

More Telugu News