HyDRAA: హైడ్రా ప్రజావాణి: రోడ్లు, పార్కుల ఆక్రమణలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు

Hyderabad Residents Complain to AV Ranganath About Encroachments
  • హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన భూకబ్జా ఫిర్యాదులు
  • మొత్తం 48 ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు
  • లే ఔట్లలో పార్కులు, రోడ్లను ఆక్రమిస్తున్నారని ప్రజల ఆవేదన
  • చెరువులు, శ్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
  • ఫిర్యాదులపై చర్యలకు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు
హైదరాబాద్ మహానగరంలో భూకబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పార్కులు, రోడ్లు, చెరువులు, చివరికి శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాదారులు చెరబడుతున్నారు. ఈ సమస్యలపై బాధితులు సోమవారం జరిగిన హైడ్రా ప్రజావాణికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా, వాటిలో అత్యధికం భూ ఆక్రమణలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా స్వీకరించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వరద కాలువలు మాయం.. నీట మునుగుతున్న కాలనీలు
ప్రజావసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొందరు లే ఔట్ల స్వరూపాలను మార్చేస్తున్నారు. ప్లాట్ల పక్కన ఉన్న పార్కు స్థలాలను మాయం చేయడం, డెడ్ ఎండ్ రోడ్లను కబ్జా చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. చెరువులకు అనుసంధానంగా ఉన్న వరద కాలువలను మూసివేయడంతో లేదా దారి మళ్లించడంతో కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయని పలువురు వాపోయారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రామచంద్రయ్య కాలనీ వాసులు తమ గోడును కమిషనర్ ముందు వెళ్లబోసుకున్నారు. చెన్నం చెరువు నుంచి రేళ్ల చెరువుకు వెళ్లే వరద కాలువను కొందరు పూడ్చివేయడంతో, తమ కాలనీ గత 8 నెలలుగా వరద నీటిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఇళ్లు నీటిలోనే ఉండటంతో, చాలామంది ఇళ్లు ఖాళీ చేసి అద్దెకు ఉంటున్నామని ఫొటోలతో సహా వివరించారు. పాత వరద కాలువను పునరుద్ధరించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

ప్రభుత్వ భూములు, శ్మశానాలపైనా కన్ను
ప్రగతినగర్ చెరువుతో పాటు అక్కడి శ్మశాన వాటికను, సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతం కూకట్‌పల్లి, నిజాంపేట మున్సిపాలిటీల సరిహద్దులో ఉండటంతో అధికారులు బాధ్యత తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవలే హైడ్రా సర్వే నంబర్ 307లో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని, అదేవిధంగా 308లోని భూమిని కూడా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, అమీర్‌పేట నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే మార్గంలో రోడ్డుపైనే ఇసుక, మట్టి, ఎరువులు రాశులుగా పోసి వ్యాపారం చేస్తున్నారని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని, జీహెచ్‌ఎంసీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, వాటిని సంబంధిత విభాగాలకు అప్పగించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
HyDRAA
AV Ranganath
Hydraa Prajavani
Hyderabad land grabbing
encroachments complaints
lake encroachments
park encroachment
road encroachment
Telangana news

More Telugu News