EPFO: ఈపీఎఫ్ఓ శుభవార్త... ఇక 100 శాతం పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

EPFO Good News 100 Percent PF Withdrawal Allowed
  • పీఎఫ్ నిధిలో 100 శాతం వరకు ఉపసంహరించుకునేలా నిబంధనల సరళీకరణ
  • 13 సంక్లిష్ట నిబంధనలను ఒకే నిబంధన కింద క్రమబద్ధీకరణ
  • చదువుకు పదిసార్లు, వివాహం కోసం 5సార్లు వరకు పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనలను సరళతరం చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా పీఎఫ్ నిధిలో ఉపసంహరించుకోగల బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు తీసుకోవచ్చు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది.

పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది. ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ముఖ్యమైన అవసరాల్లో అనారోగ్యం, విద్య, వివాహం ఉన్నాయి.

ఉపసంహరణల సంఖ్యను కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికి మూడుసార్లకే అనుమతి ఉంది.

గతంలో ప్రత్యేక పరిస్థితుల ఆప్షన్‌లో కారణం చెప్పాల్సి ఉండేది. నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పవలసిన అవసరం లేదు. పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచేలా నిబంధన రూపొందించారు.
EPFO
Employees Provident Fund Organisation
Mansukh Mandaviya
PF withdrawal
PF rules
Partial PF withdrawal

More Telugu News