Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్... దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లు

Ashwini Vaishnaw Announces 12000 Special Trains for Diwali
  • దీపావళి, ఛఠ్ పూజ కోసం ప్రత్యేక రైళ్లు
  • ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వేలో చారిత్రాత్మక మార్పులు
  • 11 ఏళ్లలో 35,000 కి.మీ. కొత్త ట్రాకులు, 99% విద్యుదీకరణ పూర్తి
  • వేగంగా అమలవుతున్న 'కవచ్' భద్రతా వ్యవస్థ
  • 1300 స్టేషన్ల ఆధునికీకరణ.. ఇప్పటికే 110 ప్రారంభం
  • ప్రతి ఏటా 7,000 కొత్త కోచ్‌ల తయారీ
పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. దీపావళి, ఛఠ్ పూజ పండగల కోసం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. "గడిచిన 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాకులు వేశాం. సుమారు 60,000 కిలోమీటర్ల మేర, అంటే 99 శాతం నెట్‌వర్క్‌ను విద్యుదీకరించాం. ప్రస్తుతం 150 వందే భారత్, 30 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నాయి" అని ఆయన వివరించారు.

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 110 స్టేషన్లను ప్రారంభించామని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశీయంగా అభివృద్ధి చేసిన 'కవచ్' ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన మార్గాల్లో వేగంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 1,200 లోకోమోటివ్‌లలో ఈ వ్యవస్థను అమర్చినట్లు వెల్లడించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి ఏటా 7,000 కొత్త కోచ్‌లను తయారు చేస్తున్నామని, ఇందులో భాగంగా 3,500 జనరల్ కోచ్‌లను అదనంగా చేర్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 41 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బందిని రాష్ట్రపతి పతకాలు, జీవన్ రక్షా పతకాలతో అశ్విని వైష్ణవ్ సత్కరించారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయన కొనియాడారు.
Ashwini Vaishnaw
Indian Railways
Diwali special trains
Chhath Puja trains
Railway Protection Force
Vande Bharat Express
Amrit Bharat Station Scheme
Automatic Train Protection
railway electrification
new railway tracks

More Telugu News