Jogi Ramesh: జోగి రమేశ్ చెప్పడం వల్లే నకిలీ మద్యం దందా చేశానన్న నిందితుడు... ఆరోపణలపై జోగి రమేశ్ స్పందన

Jogi Ramesh Responds to Fake Liquor Allegations
  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడి వీడియో కలకలం
  • మాజీ మంత్రి జోగి రమేశ్ డైరెక్షన్‌లోనే అంతా జరిగిందని వెల్లడి
  • ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి జోగి రమేశ్
ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని అతడు ఆ వీడియోలో వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తాజాగా విడుదల చేసిన వీడియోలో జనార్దన్ రావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో భాగంగానే జోగి రమేశ్ తనను ప్రోత్సహించారని ఆరోపించారు. "నకిలీ మద్యం తయారీకి ములకలచెరువు ప్రాంతాన్ని సూచించిందే జోగి రమేశ్. మద్యం తయారు చేయించింది వాళ్లే, ఆ తర్వాత వాళ్లే రైడ్ చేయించి నాటకమాడారు. ఇబ్రహీంపట్నంకు ఒకరోజు ముందే సరుకు, క్యాన్లు తెప్పించారు. జోగి రమేశ్ ఆఫర్ చేసిన 3 కోట్ల రూపాయలకు ఆశపడే నేను ఈ పని చేశాను" అని జనార్దన్ రావు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఈ ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. చంద్రబాబు ప్రభుత్వం తన చేతిలో ఉన్న సిట్‌తో విచారణ జరిపిస్తూ, కావాలనే ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరో ఒకరిని ఇరికించడానికే ఈ కుట్ర జరుగుతోందని, నకిలీ మద్యం తయారీకి ఆంధ్రప్రదేశ్ ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకుని తిరుమల రావాలని, తాను కూడా వచ్చి ప్రమాణం చేస్తానని అన్నారు. లేకపోతే, విజయవాడ కనకదుర్గ గుడికైనా రావాలని జోగి రమేశ్ పేర్కొన్నారు. తాను, జనార్దనరావు తాత ఒకే వీధిలో ఉంటామని, జనార్దనరావు పిల్లలను బెదిరించి అతడితో తనపై ఆరోపణలు చేయించారని మండిపడ్డారు. 
Jogi Ramesh
Jogi Ramesh fake liquor
Mulakalacheruvu
Andhra Pradesh fake liquor
Janardhan Rao
YSRCP
Chandrababu Naidu
AP Politics
fake liquor scandal

More Telugu News