Tata Capital: సాదాసీదాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాటా క్యాపిటల్

Tata Capital Makes Subdued Debut on Dalal Street
  • ఒక శాతం ప్రీమియంతో మార్కెట్లో అరంగేట్రం
  • ఒక్కో షేరు ధరను రూ.310- 326 గా ఇష్యూ చేసిన కంపెనీ
  • బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో రూ.330 వద్ద ట్రేడింగ్‌
టాటా క్యాపిటల్ సాదాసీదాగా దలాల్ స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. ఇటీవలి కాలంలో అతిపెద్ద ఐపీఓ కావడంతో టాటా క్యాపిటల్ లిస్టింగ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సోమవారం టాటా క్యాపిటల్ లిస్టింగ్ కాగా.. పబ్లిక్ ఇష్యూ ధరతో పోలిస్తే కేవలం ఒక శాతం ప్రీమియంతోనే షేర్లు అరంగేట్రం చేయడంతో ఇన్వెస్టర్లకు నిరాశ తప్పలేదు. ఐపీఓలో టాటా క్యాపిటల్ షేర్ ధరను రూ.310, రూ.326 మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా టాటా క్యాపిటల్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో రూ.330 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

2007లో వాణిజ్య సేవలను ప్రారంభించిన టాటా క్యాపిటల్‌.. వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు, కార్పొరేట్లకు రుణాలు అందిస్తోంది. 2025 మార్చి 31 వరకు టాటా క్యాపిటల్ కంపెనీ కస్టమర్ల సంఖ్య 70 లక్షలకు చేరింది. ఈ క్రమంలోనే టాటా క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. 

ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను టైర్‌-1 క్యాపిటల్‌ బేస్‌ను బలోపేతం చేయడానికి, భవిష్యత్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ రూ.3,655 కోట్లు, అంతకుముందు ఏడాది రూ.3,327 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం కూడా రూ.18,175 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు పెరిగింది.
Tata Capital
Tata Capital IPO
IPO listing
Dalal Street
Stock Market
BSE
NSE
Investment
Share Price

More Telugu News