Tramadol: నొప్పి నివారిణి ట్రమడోల్‌తో గుండెకు తీవ్ర ప్రమాదం

Tramadol Painkiller Poses Serious Heart Risk Study Finds
  • ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే రెట్టింపు అని వెల్లడి
  • బీఎంజే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం
  • దీర్ఘకాలం వాడితే గుండె జబ్బుల ముప్పు మరింత అధికం
  • దాదాపు 6,500 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడి  
నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యులు సూచించే సాధారణ పెయిన్ కిల్లర్ 'ట్రమడోల్'తో తీవ్రమైన గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ మాత్ర వల్ల నొప్పి తగ్గడం పరిమితంగానే ఉన్నప్పటికీ, గుండె సంబంధిత దుష్ప్రభావాలు మాత్రం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ సంచలన విషయాలు ‘బీఎంజే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్’ అనే ప్రముఖ వైద్య పత్రికలో ప్రచురితమయ్యాయి.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సుమారు 6,506 మంది క్లినికల్ ట్రయల్స్ డేటాను విశ్లేషించారు. వీరి సగటు వయసు 58 సంవత్సరాలు కాగా, వీరంతా 2 నుంచి 16 వారాల పాటు ట్రమడోల్ మాత్రలను వాడారు. ఈ పరిశీలనలో ట్రమడోల్ వాడకం వల్ల నొప్పి నుంచి లభించే ఉపశమనం చాలా స్వల్పమని తేలింది. అయితే, దీని దుష్ప్రభావాలు మాత్రం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు.

సాధారణంగా ఎలాంటి మందు లేని ప్లాసిబో మాత్రలతో పోల్చినప్పుడు, ట్రమడోల్ వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రెట్టింపు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఈ మాత్రను వినియోగించే వారిలో గుండెకు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు, అంటే సుమారు 5.16 కోట్ల మంది తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామందికి వైద్యులు ట్రమడోల్‌ను సూచిస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో, ఈ నొప్పి నివారిణి వాడకంపై పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tramadol
Painkiller Tramadol
Tramadol side effects
Heart problems Tramadol
BMJ Evidence Based Medicine
Coronary artery disease
Heart failure
Centers for Disease Control and Prevention
CDC

More Telugu News