Konda Laxma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

Konda Laxma Reddy Former Chevella MLA Passes Away
  • తెల్లవారుజామున 5.30 గంటలకు తుదిశ్వాస విడిచిన లక్ష్మారెడ్డి
  • కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి
  • మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కొండా లక్ష్మారెడ్డికి రాజకీయాల్లో గొప్ప నేపథ్యం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి స్వయానా మనవడు. తన తాత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఏపీసీసీ ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌గా సేవలు అందించారు. అంతేకాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ క్రీడా మండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1999, 2014 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేశారు.

రాజకీయాలతో పాటు జర్నలిజం రంగంపైనా కొండా లక్ష్మారెడ్డికి ఎంతో ఆసక్తి ఉండేది. ఈ మక్కువతోనే ఆయన 1980లో 'ఎన్ఎస్ఎస్' (NSS) పేరుతో ఒక స్థానిక వార్తా సంస్థను ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి జర్నలిజం వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
Konda Laxma Reddy
Konda Venkata Ranga Reddy
Chevella
Congress Party
Telangana Politics
Journalism
APCC

More Telugu News