Vivek Venkataswamy: అధిష్ఠానం చూసుకుంటుంది: వివేక్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్

Adluri Laxman Counters Vivek on Allegations Party Leadership Will Handle It
  • మంత్రి వివేక్ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఘాటు స్పందన
  • ముగిసిన వివాదాన్ని మళ్లీ ఎందుకు లేవదీస్తున్నారని ప్రశ్న
  • వివేక్ కుమారుడి గెలుపును గుర్తు చేసిన మంత్రి లక్ష్మణ్
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి. తనపై కులం పేరుతో కుట్రలు జరుగుతున్నాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన ఆరోపణలపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ముగిసిపోయిన వివాదాన్ని వివేక్ మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇకపై పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.

"వివేక్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకపై ఈ విషయంపై నేను మాట్లాడను. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు నేను సిద్ధం" అని వివేక్‌కు సవాల్ విసిరారు. అంతేకాకుండా, "వివేక్ కుమారుడు వంశీకృష్ణను ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసు" అని లక్ష్మణ్ గుర్తుచేశారు.

కొన్ని రోజుల క్రితం మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను కులం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని, మంత్రి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వెంకటస్వామి, లక్ష్మణ్‌ను రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారని, ఆ విషయాన్ని ఆయన మరిచిపోయారని వివేక్ అన్నారు. తనకు మంత్రి పదవిపై వ్యామోహం లేదని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ద్వారా తనకు వచ్చే మంచి పేరును దెబ్బతీయడానికే ఈ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

తాజాగా అడ్లూరి లక్ష్మణ్ ప్రతిస్పందనతో ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 
Vivek Venkataswamy
Adluri Laxman
Telangana Congress
Minister Controversy
Caste Politics
Internal Disputes
Vamsi Krishna
Jubilee Hills
Telangana Politics

More Telugu News