Roi Shalev: కళ్ల ముందే ప్రియురాలిని చంపిన హమాస్.. మానసిక క్షోభతో రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య

Hamas Attack Survivor Roi Shalev Commits Suicide
  • నోవా ఫెస్టివల్ దాడిలో బతికిన ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య
  • ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత మానసిక క్షోభతో బలవన్మరణం
  • కళ్ల ముందే ప్రియురాలిని, స్నేహితుడిని కోల్పోయిన విషాదం
  • ‘ఈ బాధ భరించలేను’ అంటూ సోషల్ మీడియాలో చివరి పోస్ట్
  • కాలిపోయిన కారులో లభ్యమైన రోయి షలేవ్ మృతదేహం
  • దాడి జరిగిన కొన్నాళ్లకే రోయి తల్లి కూడా ఆత్మహత్య
హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడ్డా, ఆనాటి భయానక జ్ఞాపకాలతో రెండేళ్లుగా నరకం అనుభవించిన ఓ యువకుడు చివరకు తనువు చాలించాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో తన ప్రియురాలిని, ప్రాణ స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోయిన రోయి షలేవ్ (30) తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

టెల్ అవీవ్‌లో కాలిపోయిన కారులో రోయి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మరణానికి కొన్ని గంటల ముందు, అతను సోషల్ మీడియాలో ఒక హృదయ విదారక సందేశాన్ని పోస్ట్ చేశాడు. "దయచేసి నన్ను చూసి కోపగించుకోవద్దు. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. నా లోపల ఉన్న ఈ బాధ ముగిసిపోవాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను బతికే ఉన్నాను, కానీ నా లోపల అంతా చచ్చిపోయింది" అని అందులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతకడం ప్రారంభించేలోపే జరగరానిది జరిగిపోయింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, అతను చివరిసారిగా ఒక పెట్రోల్ డబ్బా కొనుగోలు చేస్తూ కనిపించాడు.

రెండేళ్ల క్రితం నోవా ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడినప్పుడు, రోయి షలేవ్ తన ప్రియురాలు మపాల్ ఆడమ్, స్నేహితుడు హిల్లీ సోలమన్‌తో కలిసి ఒక కారు కింద దాక్కునే ప్రయత్నం చేశాడు. తన ప్రియురాలిని కాపాడేందుకు ఆమెపై పడుకున్నాడు. గంటలపాటు చనిపోయినట్లు నటించినా, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరూ గాయపడ్డారు. ఆ ఘటనలో మపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ విషాదకర ఘటనపై మపాల్ సోదరి మయాన్ స్పందిస్తూ "రోయిని అక్టోబర్ 7నే హత్య చేశారు, కానీ అతను నిన్న చనిపోయాడు. ఈ బాధను వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, రోయి కుటుంబంలో మరో విషాదం కూడా ఉంది. నోవా ఫెస్టివల్ దాడి జరిగిన కొద్ది రోజులకే రోయి తల్లి కూడా తన కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. 
Roi Shalev
Hamas
Nova Festival
Israel
Tel Aviv
Suicide
October 7 attack
Mental health
Mapal Adam
Terrorism

More Telugu News