Smriti Mandhana: కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

Smriti Mandhana Breaks Kohli Record Creates History
  • వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన
  • అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన భారత క్రికెటర్‌గా రికార్డు
  • కోహ్లీ (114 ఇన్నింగ్స్) రికార్డును అధిగమించిన మంధాన (112 ఇన్నింగ్స్)
  • ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా మరో ఘనత
  • విశాఖలో ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఈ ఫీట్
  • ప్రపంచవ్యాప్తంగా బాబర్, ఆమ్లా తర్వాత మూడో స్థానంలో మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలుకొట్టింది. విశాఖపట్నం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన ఘనతను అందుకుంది.

కోహ్లీని వెనక్కి నెట్టిన మంధాన
ఈ మ్యాచ్‌లో 80 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మంధాన, కేవలం 112 ఇన్నింగ్స్‌లోనే 5,000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (114 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. పురుషుల, మహిళల క్రికెట్ రెండింటినీ కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్‌ను వేగంగా అందుకున్న వారిలో మంధాన మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (97 ఇన్నింగ్స్), దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా (101 ఇన్నింగ్స్) మాత్రమే ఆమె కంటే ముందున్నారు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగుల రికార్డు
ఇదే మ్యాచ్‌లో మంధాన మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. 1997లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెల్లెండా క్లార్క్ నెలకొల్పిన 970 పరుగుల రికార్డును మంధాన అధిగమించారు. ఆసీస్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ వేసిన ఒకే ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్ బాది 16 పరుగులు రాబట్టి ఈ ఘనతను అందుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన మంధాన, ఆస్ట్రేలియాపై మాత్రం చెలరేగి ఆడారు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించి, ఆస్ట్రేలియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మహిళల క్రికెట్‌లో 5,000 పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న వారి జాబితాలో మంధాన (112) అగ్రస్థానంలో ఉండగా, స్టెఫానీ టేలర్ (129), సుజీ బేట్స్ (136), మిథాలీ రాజ్ (144) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Smriti Mandhana
Indian women cricket
Virat Kohli
Fastest 5000 runs
Womens World Cup 2025
Belinda Clark
Babar Azam
Hashim Amla
Cricket records

More Telugu News