Seethakka: నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క

Seethakka Clarifies No Complaint Filed Regarding Medaram Temple Works
  • సమక్క - సారలమ్మ ఆలయ అభివృద్ధిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సీతక్క
  • పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి మీడియాలో వచ్చిన వార్తలు చూపానని వెల్లడి
  • ఆలయ అభివృద్ధి అందరి బాధ్యత అన్న మంత్రి సీతక్క
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి వస్తున్న వార్తలపై రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయన్న మీడియా కథనాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరానే తప్ప తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఆదివాసీ వీరవనితలు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి వివాదం లేదా అపార్థం ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా తన బాధ్యత మేరకు మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు.

మేడారం ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవని మంత్రి సీతక్క అన్నారు. పనులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాలని ఆకాంక్షించారు. మేడారం ఆలయ అభివృద్ధి మన అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో ఆలయ అభివృద్ధి పనులను సజావుగా కొనసాగిస్తున్నదని మంత్రి వెల్లడించారు. 
Seethakka
Minister Seethakka
Medaram
Sammakka Saralamma Temple
Mahesh Kumar Goud
Telangana
Temple Development
Tribal Goddesses
TPCC Chief
Telangana Politics

More Telugu News