Donald Trump: యుద్ధం ముగిసింది: ట్రంప్ ప్రకటన.. నేటి నుంచే బందీల విడుదల

Donald Trump Announces End to Israel Hamas War Hostage Release Begins
  • రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు
  • అమెరికా మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం
  • నేటి నుంచి బందీలు, ఖైదీల మార్పిడి ప్రక్రియ ప్రారంభం
  • యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు 
  • ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ఇజ్రాయెల్
గత రెండేళ్లుగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయ‌న‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రక ఒప్పందం మేరకు ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన బందీలు, ఖైదీల మార్పిడి ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కావడంతో ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం, 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడంతో ఈ యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.

ఈ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... "యుద్ధం ముగిసింది. ఇది చాలా ప్రత్యేకమైన సమయం. అందరూ ఒకేసారి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఒప్పందంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. యూదులు, ముస్లింలు, అరబ్బులు అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ ఏకతాటిపైకి రావడం ఇదే తొలిసారి" అని అన్నారు. కాల్పుల విరమణ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇజ్రాయెల్ కు బయలుదేరారు. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఈజిప్టుకు వెళ్లి ఇతర శక్తిమంతమైన దేశాల నేతలతో సమావేశమవుతానని ట్రంప్ తెలిపారు. ఇరుపక్షాలు పోరాడి అలసిపోయాయని, ఈ కాల్పుల విరమణ ఒప్పందం కచ్చితంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, హమాస్ చెరలో ఉన్న బందీలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయల్ జమీర్ మాట్లాడుతూ, "గత రెండేళ్లుగా మేం ప్రయోగించిన సైనిక ఒత్తిడి, దౌత్యపరమైన చర్యలు హమాస్‌పై విజయానికి నిదర్శనం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు ఇకపై ఎలాంటి ముప్పు లేకుండా భద్రతా వాతావరణాన్ని నిర్మిస్తాం" అని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా హమాస్ తమ ఆధీనంలో ఉన్న బందీలను (జీవించి ఉన్నవారు, మరణించినవారు) మూడు బృందాలుగా విడుదల చేయనుంది. తొలి రెండు బృందాలను ఉదయం 10:30 గంటల కల్లా, మూడో బృందాన్ని గంట తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, హమాస్ చెరలో మరణించిన బందీలందరూ ఈరోజే తిరిగి వచ్చే అవకాశం లేదని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు తెలిపారు.
Donald Trump
Israel Hamas war
Gaza Strip
Hostage release
Ceasefire agreement
Operation Returning Home
IDF
Eyal Zamir
Middle East peace

More Telugu News