Nandamuri Balakrishna: వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫైర్... అధికారం కోసమే కొత్త నాటకాలు!

Balakrishna Fires at YSRCP Leaders Over False Promises
  • వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎమ్మెల్యే బాలకృష్ణ
  • మళ్లీ అధికారం కోసమే వారి పనికిమాలిన ప్రసంగాలు అంటూ విమర్శ
  • గత ప్రభుత్వ హయాంలో హిందూపురం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ
  • వైద్య కళాశాలల అభివృద్ధిని వైసీపీ పట్టించుకోలేదని ధ్వజం
  • తుమ్మలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన బాలయ్య
వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో పనికిమాలిన ప్రసంగాలు చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయని వారు, ఇప్పుడు కొత్తగా పీపీపీ మోడల్ పై నాటకాలు ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో పర్యటించిన ఆయన, అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. "వైసీపీ నేతలు కేవలం అధికారంపై యావతోనే ఉన్నారు. అప్పట్లో వైద్య కళాశాలల అభివృద్ధికి వారు చేసిందేమీ లేదు. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావాలనే ఉబలాటంతో ఏవేవో ఊహించుకుంటూ మాట్లాడుతున్నారు" అని బాలకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యంగా వైద్య విద్యా సంస్థలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు.

తన లక్ష్యం హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామానికి చేరుకున్న బాలకృష్ణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Nandamuri Balakrishna
Balakrishna
Hindupuram
YSRCP
Andhra Pradesh Politics
Smart Ration Cards
Chilamatturu
TDP
Medical Colleges
PPP Model

More Telugu News