Ramreddy Damodar Reddy: నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఆయన వల్లే: సీఎం రేవంత్ రెడ్డి

Ramreddy Damodar Reddy Project Announced by CM Revanth Reddy
  • ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు
  • తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • నల్గొండకు గోదావరి జలాలు ఆయన చలవేనన్న సీఎం
  • 24 గంటల్లోనే జీవో జారీ చేస్తామని వెల్లడి
  • దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ
  • ఆయన మృతికి సోనియా, ఖర్గే, రాహుల్ సంతాపం తెలిపారన్న సీఎం
తెలంగాణ దివంగత మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం ప్రకటించారు. ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేలా ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ‘రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాజెక్టు’గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రానున్న 24 గంటల్లోనే అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేస్తామని స్పష్టం చేశారు. 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నల్గొండ గడ్డపై గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అది కేవలం దామన్న ధైర్యం, పట్టుదల వల్లే సాధ్యమైంది. ఆయన ఒత్తిడితోనే నాటి ప్రభుత్వం ఎస్సారెస్పీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది" అని గుర్తుచేశారు. తుంగతుర్తి ప్రజల అభివృద్ధి కోసం ఆర్‌డీఆర్ నిస్వార్థంగా పనిచేశారని సీఎం కొనియాడారు.

దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, అధిష్ఠానం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని తెలిపారు. సోనియా గాంధీ స్వయంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారని వెల్లడించారు.

ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీరతాయని, ఇది దామోదర్ రెడ్డి ఆశయాలకు దక్కే నిజమైన నివాళి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Ramreddy Damodar Reddy
Revanth Reddy
Telangana
SRSP 2 Project
తుంగతుర్తి
Congress Party
Nalgonda
Godavari River
Irrigation Project

More Telugu News