Beeda Ravichandra: విశాఖకు గూగుల్... రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయి: ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

Beeda Ravichandra says Google to Visakhapatnam is milestone in AP history
  • హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌లా.. విశాఖకు గూగుల్ అంటూ బీదా రవిచంద్ర వ్యాఖ్యలు
  • సీఎం చంద్రబాబు దార్శనికత వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
  • రూ.55 వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు
  • గత ప్రభుత్వ ఐదేళ్ల పనితీరును 16 నెలల్లోనే అధిగమించామని వెల్లడి
  • ప్రాంతానికో పరిశ్రమతో అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం
  • విశాఖ టెక్ హబ్‌గా, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్‌గా అభివృద్ధి
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఐటీ మంత్రి నారా లోకేశ్ కృషి వల్లే గూగుల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి కీలక పాత్ర పోషించిందో, ఇప్పుడు విశాఖపట్నం విషయంలో గూగుల్ అదే తరహా విప్లవాత్మక మార్పు తీసుకురానుందని ఆయన అన్నారు. రూ.55 వేల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్, దక్షిణాసియాలోనే అతిపెద్దదిగా నిలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించడంతో పాటు, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సింగిల్ విండో క్లియరెన్స్, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం వంటి చర్యల ఫలితంగానే గూగుల్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని రవిచంద్ర వివరించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించలేని పెట్టుబడులను, తమ కూటమి ప్రభుత్వం కేవలం 16 నెలల కాలంలోనే రాష్ట్రానికి తీసుకువచ్చిందని, ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ల సమర్థ నాయకత్వానికి నిదర్శనమని ఆయన ప్రశంసించారు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఒక్కో ప్రాంతానికి ఒక్కో పారిశ్రామిక గుర్తింపు ఇస్తోందని రవిచంద్ర తెలిపారు. ఇందులో భాగంగానే విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెక్ హబ్‌గా, అమరావతిని క్వాంటం వ్యాలీగా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Beeda Ravichandra
Google Visakhapatnam
Andhra Pradesh development
Nara Lokesh
Chandrababu Naidu
AP IT sector
Visakhapatnam IT hub
Google data center
investment
employment

More Telugu News