Roja: జగన్ వస్తున్నారని తెలిసి ఆ హామీ ఇచ్చారు: రోజా

Roja Slams Chandrababu for Alleged Deception of Chittoor Mango Farmers
  • సుమారు రూ. 540 కోట్ల బకాయిలు చెల్లించలేదని రోజా ఆరోపణ
  • సీజన్ ముగిసి నాలుగు నెలలైనా రైతులకు అందని డబ్బులు
  • జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకునే హామీ ఇచ్చారని విమర్శ
  • రైతులు సమావేశం పెట్టుకోవడానికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారంటూ ఆగ్రహం
  • బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మామిడి రైతులను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ. 540 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. సొంత జిల్లా మామిడి రైతులకు బాబు మార్కు మోసం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

"మోసానికి మారుపేరు చంద్రబాబు! నమ్మిన వారినే మోసం చేయడం ఆయన ప్రత్యేకత. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే ‘నాలుక మందం’ అంటున్నారు. ఇప్పుడు సొంత జిల్లా చిత్తూరు మామిడి రైతులకూ చంద్రబాబు తనదైన శైలిలో మోసం చేస్తున్నారు. 

మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్యలపై పర్యటించి, వారికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగనన్న బంగారుపాళ్యానికి రానున్నారన్న సమాచారం తెలిసి, రైతులను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు కొత్త నాటకం ఆడారు. తోతాపురి మామిడి కిలోకు ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున మొత్తం రూ.12 ఇస్తామని హామీ ఇచ్చి, మామిడి రైతుల సమస్య పరిష్కారమైందని అబద్ధ ప్రచారం చేశారు. 

చంద్రబాబు మాటను నమ్మిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు 30 వేల మంది రైతులు 4.5 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఫ్యాక్టరీల వాటా రూ.360 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.180 కోట్లు కలిపి, మొత్తం రూ.540 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ మామిడి సీజన్‌ ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. తమ ఆవేదనను చర్చించుకోవడం కోసం రైతులు రాజకీయాలకు అతీతంగా బంగారుపాళ్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, ఆ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణం. 

చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మామిడి రైతుల బకాయిలు తక్షణం చెల్లించాలని చిత్తూరు జిల్లా ఆడబిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నాను. మామిడి రైతుల పోరాటానికి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది" అని రోజా పేర్కొన్నారు.
Roja
Chandrababu Naidu
Chittoor
Mango farmers
Andhra Pradesh
YS Jagan
Bangarupalem
Mango price
Farmers debt
TDP

More Telugu News