Chandrababu Naidu: అన్నపర్రు హాస్టల్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా... అధికారులకు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Enquires About Annanapuru Hostel Incident
  • అస్వస్థతకు గురైన బీసీ హాస్టల్ విద్యార్థులు
  • మంత్రి సవిత, అధికారులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో సమీక్ష
  • గుంటూరు జీజీహెచ్‌లో 24 మందికి చికిత్స
  • ఒక విద్యార్థిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలింపు
  • ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలకు సీఎం ఆదేశం
  • తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మంత్రి సవిత, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) 24 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. వారిలో ఒక విద్యార్థికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం నిపుణుల సలహా మేరకు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి సవిత ముఖ్యమంత్రికి తెలియజేశారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారందరినీ డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులు పూర్తిగా కోలుకున్న తర్వాతే వారిని డిశ్చార్జ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను గట్టిగా ఆదేశించారు. హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. అన్నపర్రు గ్రామంతో పాటు హాస్టల్ ప్రాంగణంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సవిత ఈ సందర్భంగా వివరించారు.

కలుషిత ఆహారం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నిర్ధారణ కోసం నీరు, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదికలు వచ్చిన వెంటనే వాటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల ఆరోగ్యానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని మంత్రి, అధికారులను ఆదేశించారు.
Chandrababu Naidu
Annanapuru hostel
Guntur
student health
Andhra Pradesh government
Pedanandipadu
food poisoning
hospital treatment
AIIMS Mangalagiri
Savitha

More Telugu News