Embassy Group: 9 రోజులు సెలవు... ఆ కంపెనీల ఉద్యోగులకు దీపావళి ఆఫర్

Embassy Group Diwali Offer 9 Days Holiday for Employees
  • దీపావళి సందర్భంగా 18 నుంచి 26 వరకు కంపెనీల సెలవులు
  • సెలవులు ప్రకటించిన ఎంబసీ గ్రూప్, పీర్ సంస్థ ఎలైట్ మార్క్
  • ఇలాంటి పండుగ బ్రేక్‌లు నూతనోత్తేజానికి దోహదం చేస్తాయంటున్న ఉద్యోగులు
దేశంలోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా వరుస సెలవులను ప్రకటించాయి. ఉద్యోగులు సంస్థాగత వృద్ధి కోసం నిరంతరం లక్ష్యాలను నిర్దేశించుకుని, గడువులోగా పూర్తి చేయడానికి శ్రమిస్తుంటారు. ఇలా తరుచూ అలసిపోవడం వల్ల వారి ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్, ఢిల్లీకి చెందిన పీర్ సంస్థ ఎలైట్ మార్క్ తమ సిబ్బంది మానసిక ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 18 నుంచి 26 వరకు తొమ్మిది రోజుల పాటు సెలవులను ప్రకటించాయి.

నిత్యం కార్యాలయ పనుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు విరామం ఎంతో అవసరమని, ఇలాంటి పండుగ సెలవులు వారికి ఎంతో దోహదం చేస్తాయని ఎంబసీ గ్రూప్‌ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ మారియా రాజేశ్ అన్నారు.

దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఎలైట్ మార్క్ సీఈవో రజత్ గ్రోవర్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ సెలవుల్లో సంస్థాగత ఈ-మెయిళ్లకు దూరంగా ఉంటూ, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచించారు.

సంస్థ ప్రకటించిన సెలవులపై ఒక ఉద్యోగి తన హర్షం వ్యక్తం చేస్తూ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముందుకెళుతున్న సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సెలవులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించి, నూతనోత్సాహంతో పనిపై దృష్టిపెట్టడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.

ఈ-కామర్స్ సంస్థ మీషో కూడా ఉద్యోగులకు వరుస సెలవులను ప్రకటించింది. మెగా బ్లాక్‌బాస్టర్ సేల్స్ తర్వాత ఉద్యోగులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, తమపై తాము దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. సెలవుల అనంతరం సరికొత్త శక్తితో తిరిగి వస్తామని మీషో తెలిపింది. ఈ విధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Embassy Group
Diwali offer
employee holidays
employee wellbeing
Elite Mark
Meesho

More Telugu News