Botsa Satyanarayana: బొత్స ఈ మధ్య బాగా ఫోకస్ అవుతున్నారు... ఆయనకు జగన్ నుంచే ప్రాణహాని ఉంది: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao Claims Botsa Satyanarayana Faces Threat From Jagan
  • తనకు ప్రాణహాని ఉందన్న బొత్స
  • జగన్ ను మించి ఎవరైనా ఎదిగితే అంతేనన్న పల్లా శ్రీనివాసరావు
  • అవసరమైతే బొత్సకు ప్రభుత్వ భద్రత కల్పిస్తామని హామీ
వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు వారి పార్టీ అధినేత జగన్ నుంచే ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా బొత్స ప్రకటించిన నేపథ్యంలో, ఆయనకు ప్రభుత్వపరంగా పూర్తి భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పల్లా ప్రకటించారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బొత్స మాటలను బట్టి చూస్తే, ఆయనకు వైసీపీ నుంచే ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోందని పల్లా అన్నారు.

"జగన్‌ను మించి వెళ్లినా, పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్నా వారిని అంతం చేయడమే ఆయన నైజం" అని పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా ఇదే కారణంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా, మండలిలో బొత్స పనితీరు బాగా ఫోకస్ అవుతోందని, ఇది చూసి ఓర్వలేకే జగన్ ఆయనపై కక్ష పెంచుకున్నారని అనిపిస్తోందని పల్లా అభిప్రాయపడ్డారు. "బొత్స సత్యనారాయణ అంటే మాకు గౌరవం ఉంది. ఆయన భయపడాల్సిన అవసరం లేదు. మేం ఆయనకు అండగా నిలుస్తాం" అని పల్లా హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లూలూ, రిలయన్స్, ఎన్టీపీసీ గ్రీన్ టెక్ హైడ్రోజన్, వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు వల్లే అన్నారు. 

"విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతోంది. విశాఖలో సిఫి ఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ప్రారభించబోతున్నారు. ఢిల్లీలో గూగూల్ కు చెందిన రైడెన్ తో రూ.87,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నాం. ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్ గా వర్జీనియా ఉంది. రేపు వరల్డ్ డేటా సెంటర్ గా విశాఖ మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయాలన్న లక్ష్యంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. విశాఖను డేటా హబ్ గా, డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లబోతున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సాకారంతో నేడు విశాఖ ఐటీ సీటీగా రూపాంతరం చెందబోతోంది. 

విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే... జగన్ అడుగడుగునా భవిష్యత్ భయంతో అడ్డుపడుతున్నారు. రాస్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారు. పెట్టుబడి దారులకు భయాందోళనలు కలిగించేలా జగన్ అల్లర్లు చేస్తున్నారు. పెట్టబడులు పెట్టకండని అనేక ఆర్థిక సంస్థలకు వైసీపీ వాళ్లు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు" అంటూ పల్లా ధ్వజమెత్తారు.
Botsa Satyanarayana
Palla Srinivasa Rao
YS Jagan
TDP
Andhra Pradesh Politics
Visakhapatnam
Chandrababu Naidu
AP Investments
Data Center
Political Threat

More Telugu News