Aryan Khan: ఇంట్లోనే షార్ట్ ఫిల్మ్... నాన్న, చెల్లితో కలిసి పనిచేశా: ఆర్యన్ ఖాన్

Aryan Khan on Filmmaking Inspiration from Shah Rukh Khan
  • ‘ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్’తో విజయం అందుకున్న ఆర్యన్ ఖాన్
  • సినిమా మేకింగ్ తనకు నాన్న నేర్పిన మ్యాజిక్ అన్న ఆర్యన్ ఖాన్ 
  • తన సిరీస్‌లో ఎవరినీ అగౌరవపరిచేలా సన్నివేశాలు ఉండవని స్పష్టీకరణ
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారి తీసిన ‘ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సక్సెస్ తర్వాత తొలిసారిగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్యన్, తన తండ్రి షారుఖ్ వల్లే తనకు ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తి కలిగిందని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సినిమా నిర్మాణంలో తన తండ్రి తనకు ఎలా స్ఫూర్తిగా నిలిచారో వివరించాడు.

ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ, "సినిమా నిర్మాణంలోని వీఎఫ్ఎక్స్, లైటింగ్, కెమెరా వర్క్.. ఇలా అన్ని అంశాలపై మా నాన్నకు చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే ఆయన నాకు ఇవన్నీ చూపించేవారు. 'నిజంగా బుల్లెట్ తగలదు, దాన్ని ఇలా చూపిస్తారు' అని చెప్పేవారు. అసలు విమానం ఎగరకుండానే, అది ఆకాశంలో ఎగురుతున్నట్లు ఎలా చూపిస్తారో వివరించేవారు. అవన్నీ ఒక పిల్లాడికి అద్భుతంలా అనిపించేవి" అని ఆర్యన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

ఇదే క్రమంలో లాక్‌డౌన్ సమయంలో తాను, తన తండ్రి షారుఖ్, చెల్లి సుహానా ఖాన్ కలిసి ఇంట్లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీశామని ఆర్యన్ వెల్లడించాడు. "లాక్‌డౌన్‌లో రెండేళ్ల పాటు పెద్దగా పని లేకపోవడంతో మేమంతా కలిసి ఓ కథ రాసుకున్నాం. దాన్ని మా ఇంట్లోనే చిత్రీకరించాం. ఆ షార్ట్ ఫిల్మ్‌లో నాన్న, చెల్లి నటించగా, నేను డీఓపీగా (సినిమాటోగ్రాఫర్) పనిచేశాను" అని తెలిపాడు.

తన తొలి సిరీస్ గురించి మాట్లాడుతూ, "మాపై మేం సెటైర్లు వేసుకోవాలనుకున్నాం కానీ, ఎక్కడా ఎవరినీ అగౌరవపరచకూడదని భావించాం. ఆ గీతను మేం సరిగ్గా పాటించామని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉంటూ, ఇండస్ట్రీ గురించే తీస్తున్నప్పుడు ఎంతో గౌరవం ఉండాలి. కామెడీలో ముఖ్యమైన విషయం మనపై మనం జోకులు వేసుకోగలగడం. ఇండస్ట్రీలోని వారు కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు" అని ఆర్యన్ ఖాన్ వివరించాడు. 
Aryan Khan
Shah Rukh Khan
The Bravest of Bollywood
Suhana Khan
Bollywood
Film making
Short film
VFX
Lockdown
Cinematography

More Telugu News