Narendra Modi: భారత్ దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే అలా కూడా చేయండి: నరేంద్ర మోదీ పిలుపు

Narendra Modi calls for reduced import dependence
  • ప్రొటీన్ అధికంగా లభించే పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలన్న ప్రధాని
  • దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులది ముఖ్య పాత్ర అని వ్యాఖ్య
  • ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన వద్ద పండించాలన్న మోదీ
భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమ పంటలతోపాటు ప్రొటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆయన పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన దేశంలో పండించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి రూ. 5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తే, తమ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ. 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని ఆయన తెలిపారు.

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు చోటుచేసుకోవాలని మోదీ అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.

ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు. వీటన్నింటినీ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన కిందకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో గత పాలకులు రోడ్లు వేయించలేదని, అలాంటి ప్రాంతాలను తమ ప్రభుత్వం డిజిటల్ ఇండియా దిశగా నడిపిస్తోందని అన్నారు. గత పదకొండేళ్లలో రైతులు పలు విజయాలు సాధించారని, పదివేలకు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయని తెలిపారు.
Narendra Modi
India imports
agriculture
PM Dhan Dhanya Krishi Yojana
Atmanirbharta
pulses cultivation

More Telugu News