Michigan Lottery: స్కామ్ కాల్ అనుకుంటే.. జీవితాన్నే మార్చేసిన జాక్‌పాట్!

Valerie Williams wins million dollar lottery after scam call mixup
  • అమెరికాలో 65 ఏళ్ల మహిళకు లాటరీలో భారీ జాక్‌పాట్
  • ఏకంగా రూ. 8.8 కోట్లు గెలుచుకున్న వాలెరీ విలియమ్స్
  • లాటరీ ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్‌ను స్కామ్ కాల్‌గా భావించిన వృద్ధురాలు
  • పనికిరాని టికెట్లను యాప్‌లో స్కాన్ చేయడంతో వచ్చిన సెకండ్ ఛాన్స్
  • బహుమతి డబ్బుతో భర్తతో కలిసి విహారయాత్రకు వెళతానని వెల్లడి
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. కొన్నిసార్లు దాన్ని మనం గుర్తించలేకపోవచ్చు కూడా. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకుంది. ఓ స్కామ్ కాల్ అనుకుని లైట్ తీసుకున్న ఫోన్ కాల్ తన జీవితాన్నే మార్చేస్తుందని 65 ఏళ్ల వృద్ధురాలు ఊహించలేదు. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది.

వివరాల్లోకి వెళితే.. మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన వాలెరీ విలియమ్స్ అనే 65 ఏళ్ల మహిళ చాలాకాలంగా లాటరీ టికెట్లు కొంటున్నారు. తనకు బహుమతి రాని టికెట్లను మిచిగాన్ లాటరీ యాప్‌లో స్కాన్ చేసేవారు. అయితే, అలా స్కాన్ చేసిన ప్రతి టికెట్ ఆటోమేటిక్‌గా సెకండ్ ఛాన్స్ డ్రాకు వెళుతుందన్న విషయం ఆమెకు తెలియదు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు లాటరీ ఆఫీస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది.

తాను రూ. 8.8 కోట్లు (ఒక మిలియన్ డాలర్లు) గెలుచుకున్నట్లు చెప్పిన ఆ ఫోన్‌ కాల్ ను ఆమె మొదట నమ్మలేదు. "మిచిగాన్ లాటరీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పగానే, ఇది ఏదో స్కామ్ అయి ఉంటుందని భావించి మొదట పట్టించుకోలేదు. కానీ, ఏం చెబుతారో చూద్దామని ఫోన్ మాట్లాడాను. నేను ఏకంగా 1 మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్‌అవే పోటీకి ఎంపికయ్యానని తెలిసి షాక్ అయ్యాను" అని వాలెరీ తెలిపారు.

ఆ తర్వాత సెప్టెంబర్ 19న డెట్రాయిట్‌లోని కొమెరికా పార్క్‌లో ప్రైజ్ వీల్ తిప్పేందుకు ఆమెను ఆహ్వానించారు. ఆ చక్రం తిరుగుతున్నప్పుడు చాలా ఉత్కంఠగా అనిపించిందని, చివరికి అది తాను ఎంచుకున్న రంగుపై ఆగడంతో నమ్మలేకపోయానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఈ గెలుపుపై లాటరీ కమిషనర్ సుజాన్నా ష్రెలీ మాట్లాడుతూ.. వాలెరీ విలియమ్స్‌కు అభినందనలు తెలిపారు. సెకండ్ ఛాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వినియోగ‌దారుల‌ను సూచించారు. ఇక‌, తాను గెలుచుకున్న డబ్బును ప్రస్తుతానికి దాచుకుంటానని, త్వరలోనే తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు వాలెరీ వెల్లడించారు.

Michigan Lottery
Valerie Williams
lottery winner
million dollar prize
second chance draw
Westland Michigan
Comerica Park
Detroit
lottery scam

More Telugu News