Srikanth Bharat: గాంధీపై అనుచిత వ్యాఖ్యలు: నటుడు శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదు

Congress MLC demands sedition case against Srikanth Bharat
  • శ్రీకాంత్‌పై సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు
  • శ్రీకాంత్ భరత్ 'మా' సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి
  • సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాలని కోరిన బల్మూర్ వెంకట్
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, సదరు నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, శ్రీకాంత్ భరత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా వెంకట్ బల్మూరి మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్ర్యం పేరుతో కొందరు హద్దులు మీరుతున్నారని మండిపడ్డారు. గాడ్సే వారసులమని చెప్పుకునే వారే గాంధీజీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాంత్ భరత్ చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

త్వరలోనే 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి, శ్రీకాంత్ భరత్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరతామని వెంకట్ బల్మూరి తెలిపారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ భరత్‌పై ఫిర్యాదులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Srikanth Bharat
Mahatma Gandhi
Balmoor Venkat
Congress MLC
Defamatory comments
Cyber Crime Police
MAA Association
Vishnu Manchu
Hyderabad
Telangana

More Telugu News