Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే వద్దన్న వియత్నామీ లీడర్

Nobel Peace Prize Declined by Le Duc Tho
  • నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ వెంపర్లాట నేపథ్యంలో వైరల్ గా మారిన నాటి ఘటన
  • 1973లో లే డక్ థోకు శాంతి బహుమతి ప్రకటించిన నోబెల్ కమిటీ
  • అమెరికా, వియత్నాం యుద్ధం ఆపడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఎంపిక
  • దక్షిణ వియత్నాంలో పూర్తిగా శాంతి నెలకొనలేదనే కారణంతో బహుమతి వద్దన్న థో
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా వెంపర్లాడారో ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ స్వోత్కర్ష గురించి చెప్పనక్కర్లేదు. భారత్ ఖండించినా కూడా పట్టించుకోకుండా భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఓ దశలో ఇంత చేసినా తనకు నోబెల్ రాదేమోనని ట్రంప్ నిర్వేదం ప్రకటించారు. ఏమీ చేయకున్నా కూడా బరాక్ ఒబామాకు నోబెల్ ఇచ్చారంటూ మాజీ అధ్యక్షుడిపై అక్కసు వెలిబుచ్చడమూ తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతికి ఉన్న గుర్తింపు ట్రంప్ ను ఆ బహుమతి కోసం వెంపర్లాడేలా చేసింది. ట్రంప్ ఇంతలా ఆశించిన బహుమతిని ఓ నేత మాత్రం తృణప్రాయంగా ఎంచి తనకు వద్దు పొమ్మన్నాడంటే విశేషమే కదా! అవును.. నోబెల్ శాంతి బహుమతి ఇస్తామని ఆఫర్ చేసినా తనకు వద్దని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనే వియత్నాంకు చెందిన రాజకీయ వేత్త విప్లవకారుడు, దౌత్యవేత్త లె డక్ థో.. వివరాల్లోకి వెళితే..
 
ఫ్రాన్స్ ఓటమి తర్వాత వియత్నాం రెండుగా విడిపోయింది. ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టు, దక్షిణ వియత్నాంలో ప్రజస్వామ్య ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాయి. దక్షిణ వియత్నాంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన అమెరికా.. ఉత్తర వియత్నాంలోని కమ్యూనిస్టు పాలనను చూసి చుట్టు పక్కల దేశాలు కూడా కమ్యూనిస్టు పాలన వైపు మొగ్గుతాయనే భయం మొదలైంది. దాంతో, వియత్నాంపై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధానికి ముగింపు పలకడంలో లె డక్ థో ఉత్తర వియత్నాం తరఫున కీలక పాత్ర పోషించారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌తో కలిసి 1973లో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో లె డక్ థో కీలకంగా వ్యవహరించారు. దీంతో నోబెల్ కమిటీ 1973లో హెన్రీ కిస్సింజర్‌తో పాటుగా లె డక్ థోకు కూడా శాంతి బహుమతిని ప్రకటించింది. కానీ లె డక్ థో దానిని తిరస్కరించారు. పారిస్ శాంతి ఒప్పందం మేరకు దక్షిణ వియత్నాంలో శాంతి పునరుద్ధరిస్తేనే తాను నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించే విషయం పరిశీలిస్తానని తెలుపుతూ లె డక్ నోబెల్ కమిటీకి టెలిగ్రామ్ పంపారు.

అమెరికా, దక్షిణ వియత్నాం మధ్య నిరంతర సంఘర్షణ కొనసాగుతోందని, అక్కడ ఇంకా శాంతి ఏర్పడలేదని చెబుతూ.. ఇలాంటి పరిస్థితిలో తాను శాంతి బహుమతిని ఎలా స్వీకరించాలని లె డక్ థో ప్రశ్నించారు.
Nobel Peace Prize
Le Duc Tho
Vietnam
Henry Kissinger
Paris Peace Accords
Vietnam War
Donald Trump
North Vietnam
South Vietnam

More Telugu News