Marufa Akter: నాన్నతో కలిసి పొలం పనులు.. నేడు బంగ్లాదేశ్ స్టార్ పేసర్

Marufa Akter From Farming to Bangladesh Star Pacer
  • గతాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న బంగ్లా పేసర్ మరూఫా అక్తర్
  • మంచి బట్టలు లేవని శుభకార్యాలకు పిలిచేవారు కాదంటూ ఆవేదన
  • పేద‌రికం కార‌ణంగా తండ్రితో కలిసి పొలం పనులు చేసిన వైనం 
  • ప్రస్తుతం బంగ్లా జట్టులో కీలక బౌలర్‌గా అద్భుత ప్రదర్శన
  • కుటుంబానికి అండగా నిలవడంపై ఆనందం వ్యక్తం చేసిన యువ క్రికెటర్
బంగ్లాదేశ్ యువ మహిళా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మరూఫా అక్తర్ తన గతాన్ని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఒకప్పుడు తమ పేదరికం కారణంగా కనీసం శుభకార్యాలకు కూడా ఎవరూ పిలిచేవారు కాదని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఐసీసీ ప్రసారం చేసిన ఓ ప్రత్యేక డాక్యుమెంటరీలో ఆమె తన జీవితంలోని కష్టాల గురించి పంచుకున్నారు.

"మా దగ్గర సరైన బట్టలు లేవని చెప్పి, వాళ్లు మమ్మల్ని ఏ ఫంక్షన్‌కు పిలిచేవారు కాదు. మేము అక్కడికి వెళ్తే మా పరువు పోతుందని అనేవాళ్లు. పండగ రోజు కనీసం కొత్త బట్టలు కొనుక్కునే స్థోమత కూడా మాకు ఉండేది కాదు" అని చెబుతూ మరూఫా కన్నీళ్లు పెట్టుకున్నారు. తమది వ్యవసాయ కుటుంబమని, తన తండ్రి ఓ సాధారణ రైతు అని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో తండ్రితో కలిసి కౌలుకు తీసుకున్న పొలంలో తాను కూడా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో తమ గ్రామంలోని వారి నుంచి కూడా పెద్దగా మద్దతు లభించలేదని ఆమె వాపోయారు.

అయితే, పేదరికాన్ని, అవమానాలను జయించిన 20 ఏళ్ల మరూఫా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టులో స్టార్ బౌలర్‌గా వెలుగొందుతున్నారు. తన అద్భుతమైన ఇన్-స్వింగర్లతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మూడు మ్యాచ్‌లలోనే ఆమె 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.

ఒకప్పుడు తమను చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు టీవీలో తన ఆటను చూసి ప్రశంసిస్తుండటం సంతోషంగా ఉందని మరూఫా అన్నారు. "ఇప్పుడు మా కుటుంబానికి నేను అండగా నిలుస్తున్నాను. చాలా మంది అబ్బాయిలు కూడా అలా చేయలేరేమో. ఇది నాకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. చిన్నప్పుడు అందరూ మమ్మల్ని ఎప్పుడు గౌరవంగా చూస్తారా అని ఎదురుచూసేదాన్ని. ఇప్పుడు టీవీలో నన్ను నేను చూసుకుంటే సిగ్గేస్తోంది" అని ఆమె నవ్వుతూ చెప్పారు.

2023లో అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన మరూఫా, అప్పటి నుంచి జాతీయ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 29 వన్డేల్లో 25 వికెట్లు, 30 టీ20ల్లో 20 వికెట్లు పడగొట్టారు.
Marufa Akter
Bangladesh cricket
Bangladesh women cricket
Marufa Akter interview
ICC documentary
Poverty
Farming
World Cup
Cricket
Fast Bowler

More Telugu News