MS Dhoni: మధురైలో ధోనీ హంగామా.. భారీ స్టేడియం ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన

MS Dhoni Touched by Fans Respect at Madurai Stadium Launch
  • మధురైలో వెలమ్మాల్ క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన ఎంఎస్ ధోనీ
  • ప్రారంభోత్సవంలో ధోనీ కాళ్లు మొక్కబోయిన యువ అభిమాని
  • తమిళనాడులో ఇది రెండో అతిపెద్ద క్రికెట్ మైదానం
  • రూ.300 కోట్లకు పైగా వ్యయంతో 12.5 ఎకరాల్లో నిర్మాణం
  • ధోనీని చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అయినా, బయట అయినా ఆయన కనిపిస్తే చాలు.. అభిమానులు ఉప్పొంగిపోతారు. తాజాగా మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. స్టేడియం ప్రారంభోత్సవంలో భాగంగా ధోనీ బ్యాటింగ్ చేసేందుకు వస్తుండగా, వికెట్ కీపింగ్‌కు సిద్ధంగా ఉన్న ఓ యువ అభిమాని పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించబోయాడు. వెంటనే స్పందించిన ధోనీ, ఆ కుర్రాడిని ఆపి ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆశీర్వదించారు. ఈ హృద్యమైన సంఘటన అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

తమిళనాడులోని మధురై చింతామణి సమీపంలో నిర్మించిన వెలమ్మాల్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి ఎంఎస్ ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం కోసం ఆయన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నాడు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్ట్ వద్దకు ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ధోనీ తన జెర్సీ నంబర్ '7' ఉన్న తెల్ల రంగు కారులో స్టేడియంకు బయలుదేరగా, అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

వెలమ్మాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) సంయుక్తంగా ఈ ప్రపంచ స్థాయి స్టేడియంను నిర్మించాయి. సుమారు 12.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లకు పైగా వ్యయంతో దీనిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం 7,300 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం సామర్థ్యాన్ని భవిష్యత్తులో 20,000కు పెంచే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ధోనీ కొన్ని షాట్లు ఆడి అభిమానులను అలరించారు. కార్యక్రమం ముగిశాక, మళ్లీ '7' నంబర్ ఉన్న మరో నీలి రంగు కారులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ముంబైకి తిరుగుపయనమయ్యారు.
MS Dhoni
Dhoni
MS Dhoni fan
Vellammal Cricket Stadium
Madurai
Tamil Nadu Cricket Association
TNCA
Cricket stadium inauguration
Cricket
Mahendra Singh Dhoni

More Telugu News