Nara Lokesh: ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh calls for successful PM Modi meeting
  • 16న కర్నూలులో సూపర్ జిఎస్‌టి - సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ 
  • ప్రధాని మోదీతో పాటు సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రి లోకేష్ హాజరు
  • జిఎస్‌టి సేవింగ్స్‌పై  రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు
  • ఏర్పాట్ల‌పై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష
  • ఈనెల 16 నుంచి 19 తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జిఎస్టి షాపింగ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయాలన్న మంత్రుల బృందం
ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహమ్మద్ బాబు హాజరయ్యారు.

ఈ నెల 16వ తేదీ ఉదయం ప్రధాని మోదీ సున్నిపెంట వద్ద ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం బయలుదేరి వెళతారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. తర్వాత శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు సమీపంలోని నన్నూరు రంగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సూపర్ జీఎస్టీ –సూపర్ సేవింగ్స్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రధాని మోదీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ప్రసంగిస్తారు. సభానంతరం ప్రధాని మోదీ సాయంత్రం కర్నూలు సమీపాన గల ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా సూపర్ జీఎస్టీ –సూపర్ సేవింగ్స్‌పై పెద్దఎత్తున నిర్వహించిన ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం చర్చించింది. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ... ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌పై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. నూతన జీఎస్టీ విధానంవల్ల కలిగే లబ్ధిపై రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్‌లో 22,500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.

రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... నూతన జీఎస్టీ అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఆటోమొబైల్ సేల్స్ గణనీయంగా పెరిగాయని, ఈ పెరుగుదల 33 శాతానికి పైగా ఉందని చెప్పారు. లగ్జరీ కార్లకు సైతం సెస్సును తొలగించడం వల్ల ఆ విభాగంలో కూడా అమ్మకాలు ఆశాజనకంగా నమోదవుతున్నాయని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 16 నుంచి 19 తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రుల బృందం కోరింది. 
Nara Lokesh
PM Modi
Andhra Pradesh
Kurnool
Super GST Super Savings
Chandrababu Naidu
Pawan Kalyan
Srisailam Temple
GST Awareness Programs

More Telugu News