Shiva Dhar Reddy: తెలంగాణలో డీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు

Telangana DGP Shiva Dhar Reddy Welcomes Surrender of Key Maoists
  • కుంకటి వెంకటయ్య, మొగిలిచర్ల వెంకట్రాజు, తోడెం గంగ లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడి
  • సైద్ధాంతిక విభేదాల కారణంగా పోలీసులు ఇచ్చిన పిలుపుతో లొంగిపోయారన్న డీజీపీ
  • ఇటీవలి కాలంలో 403 మంది మావోయిస్టులు లొగిపోయారని వెల్లడి
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు వారు లొంగిపోయినట్లు డీజీపీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోని మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు తెలిపారు.

ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెప్పారు. పీడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారని, 35 ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నట్లు డీజీపీ చెప్పారు.

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన వెంకట్రాజు 11 ఏళ్ళ వయస్సులో విప్లవ గీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరాడని డీజీపీ వెల్లడించారు. 1993లో నర్సంపేట దళంలో చేరి, వివిధ హోదాల్లో పని చేసినట్లు చెప్పారు. ఇప్పుడు తన భార్య గంగతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు.
Shiva Dhar Reddy
Telangana DGP
Maoists surrender
Kunkati Venkataiah
Mogilicherla Venkatraju

More Telugu News