Vishal Tiwari: దగ్గు మందు కారణంగా చిన్నారుల మృతి.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Vishal Tiwaris Petition on Cough Syrup Deaths Dismissed by Supreme Court
  • పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి
  • కేసును పరిశీలించిన అనంతరం విచారించేందుకు నిరాకరణ
  • న్యూస్ పేపర్లు చదివి పిటిషనర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో దగ్గు మందు కారణంగా చిన్నారులు మృతి చెందిన అంశంపై సీబీఐతో విచారణ జరపాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి ఈ పిటిషన్ దాఖలు చేశారు. మొదట ధర్మాసనం నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించింది. ఆ తర్వాత కేసును పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.

న్యూస్ పేపర్లు చదివి పిటిషనర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. తాను ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించడం లేదని, కానీ తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఈ విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు. వాటిని విస్మరించలేమని మెహతా కోర్టుకు తెలిపారు.

డ్రగ్స్ చట్టాలు అమలు చేసేందుకు తగిన వ్యవస్థలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయని ఆయన అన్నారు. సుప్రీం కోర్టులో ఇప్పటి వరకు ఎన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని పిటిషనర్ తివారిని ధర్మాసనం ప్రశ్నించింది. 8 నుంచి 10 దాఖలు చేసినట్లు ఆయన సమాధానం చెప్పగా, ధర్మాసనం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

నాసిరకం మందులు మార్కెట్‌కు చేరకుండా తొలుత నాణ్యతా పరీక్ష వ్యవస్థల్లోని లోపాలను దర్యాప్తు చేయాలని, ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని తన వ్యాజ్యంలో న్యాయవాది తివారి కోరారు. అమ్మకాలు, ఎగుమతులకు అనుమతించే ముందు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో అనుమానిత ఉత్పత్తులకు టాక్సికాలజీ పరీక్షలను తప్పనిసరిగా చేయాలని పిటిషనర్ కోరారు.
Vishal Tiwari
cough syrup deaths
supreme court
cbi investigation
madhya pradesh
rajasthan
tushar mehta
drug laws

More Telugu News