Ram Gopal Varma: 36 ఏళ్ల తర్వాత 'శివ' క్యారెక్టర్ అర్థమైంది: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Understands Shiva Character After 36 Years
  • 36 ఏళ్ల తర్వాత ఐకానిక్ 'శివ' పాత్రపై వర్మ విశ్లేషణ
  • రీ-రిలీజ్ కోసం సినిమా చూస్తుండగా కొత్తగా అర్థమైందన్న ఆర్జీవీ
  • శివ ఒక వ్యక్తి కాదు, భయానికి లొంగని ఒక సిద్ధాంతం
  • ఆత్మగౌరవం విషయంలో శివది దాదాపు గాంధేయవాదం
  • శివ మౌనమే అతిపెద్ద ఆయుధమని వర్మ వ్యాఖ్య
  • అందుకే 36 ఏళ్లయినా శివను ఎవరూ మర్చిపోలేరని వెల్లడి
తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం, ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' విడుదలై 36 సంవత్సరాలు పూర్తయింది. నాగార్జున కెరీర్‌ను శిఖరాగ్రానికి చేర్చిన ఈ చిత్రం, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు చెరిగిపోని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రీ-రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, ఆ సంచలన చిత్రాన్ని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్ర కథానాయకుడు 'శివ' పాత్రను తాను ఇప్పుడు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. తాను 26 ఏళ్ల వయసులో కేవలం ఊహతో సృష్టించిన శివ పాత్ర, 62 ఏళ్ల వయసులో పరిణతితో చూసినప్పుడు కొత్తగా అర్థమైందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. రీ-రిలీజ్ కోసం సినిమాను మళ్లీ చూస్తున్నప్పుడు ఈ కొత్త అవగాహన కలిగిందని ఆయన తెలిపారు.

ఆత్మగౌరవమే 'శివ' అసలైన వ్యక్తిత్వం

"శివ అపారమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. అతని ధైర్యానికి మూలం తను నమ్మిన సిద్ధాంతాలే. బెదిరింపులకు, దౌర్జన్యాలకు తలొంచడం కన్నా చావడమే మేలని భావించే తత్వం అతనిది. అతనికి గౌరవం అనేది ఒక సుగుణం కాదు, అది మనిషి అస్తిత్వానికే చిహ్నం" అని వర్మ వివరించారు. శివ పాత్ర సంప్రదాయ హీరోల్లా భావోద్వేగాలను ప్రదర్శించదని, పెద్దగా అరవడని, అతని శక్తి నిశబ్దంలోనే ఉంటుందని తెలిపారు. "అతను కీర్తి కోసమో, ప్రతీకారం కోసమో పోరాడడు. అణచివేతను సహించలేక మాత్రమే ఎదురు తిరుగుతాడు. అతని తిరుగుబాటు పైకి కనిపించదు, అది అంతర్గతమైనది. అతని ప్రశాంతమైన రూపానికి, లోపలున్న సిద్ధాంతాల తుఫానుకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణే శివ" అని వర్మ పేర్కొన్నారు. రాజకీయాలు, గ్యాంగ్‌లు, అధికారంపై శివకు ఆసక్తి లేకపోయినా, భయపెట్టలేని వాడిని చూసి అధికారమే అతని వైపు ఆకర్షితురాలవుతుందని వ్యాఖ్యానించారు.

మౌనం, హింస వెనుక ఉన్న మనస్తత్వం

శివ మానసిక స్థితిలో ఒక వైరుధ్యం కనిపిస్తుందని వర్మ అభిప్రాయపడ్డారు. శాంతిని కోరుకుంటూనే, దాన్ని కాపాడటానికి హింసను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. "అతని ధైర్యం భయం లేకపోవడం నుంచి రాలేదు, స్పష్టత నుంచి వచ్చింది. దేని కోసం బతకాలో, దేని కోసం చనిపోయాలో అతనికి స్పష్టంగా తెలుసు. అందుకే భయం అతని దరిచేరదు. ఇతరులు భయంతో అణిగిమణిగి ఉండటాన్ని శివ అస్సలు సహించలేడు. ఎందుకంటే దాన్ని మానవ గౌరవానికి జరిగిన ద్రోహంగా భావిస్తాడు" అని తెలిపారు.

శివ నిశబ్దాన్ని ఒక కవచంగా అభివర్ణించారు. "అతను మాటలు వృథా చేయడు, ఎందుకంటే అతనికి మాటలంటే వాగ్దానాలతో సమానం. అతని నిశబ్దం ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే అతను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ నిశబ్దమే చెబుతుంది. అతని ప్రశాంతత నియంత్రణలో ఉన్న శక్తికి నిదర్శనం" అని వర్మ పేర్కొన్నారు. శివకు హింస అంటే ఇష్టం ఉండదని, కానీ అది ఒక పర్యవసానమని అన్నారు. "వివేచన పనిచేయనప్పుడు, పిడికిళ్లే మాట్లాడాలని అతను నమ్ముతాడు. అవినీతి వ్యవస్థలో, అణచివేతదారులకు అర్థమయ్యే ఏకైక భాష హింస అని అతను భావిస్తాడు" అని విశ్లేషించారు.

అధికారంపై 'శివ' దృక్పథం

అధికారం అంటే శివకు ద్వేషం లేదని, కానీ దాని దుర్వినియోగాన్ని మాత్రం సహించలేడని వర్మ స్పష్టం చేశారు. "ప్రతి వ్యవస్థ నియంత్రణతోనే నడుస్తుందని అతనికి తెలుసు. కానీ అధికారం అనేది గౌరవాన్ని కాపాడాలి తప్ప, దానిపై ఆధిపత్యం చెలాయించకూడదని అతను నమ్ముతాడు. అందుకే నేరస్థులు, రాజకీయ నాయకులు అతనికి భయపడతారు. ఎందుకంటే అతడిని ప్రలోభపెట్టలేరు, భయపెట్టలేరు. ప్రాణాలకు తెగించిన వాడిని ఏ ఆయుధం భయపెట్టగలదు?" అని వర్మ ప్రశ్నించారు.

చివరగా, "శివ ఒక వ్యక్తి కాదు, రాజీలతో నిండిన వ్యవస్థను ఒకే ఒక్కడు తన నిజాయితీతో ఎలా కదిలించగలడో చెప్పే ఒక సిద్ధాంతం. అతను గెలిచినందుకు హీరో కాలేదు, తనను తాను కోల్పోవడానికి నిరాకరించినందుకు హీరో అయ్యాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ శివలా ఉండాలని కోరుకుంటారు, కానీ అందుకు కావాల్సిన ధైర్యం లేక అతడిని ఆరాధిస్తారు. 36 ఏళ్ల తర్వాత కూడా శివ పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోవడానికి ఇదే కారణం" అని వర్మ తన విశ్లేషణను ముగించారు.
Ram Gopal Varma
Shiva movie
Nagarjuna
Telugu cinema
Shiva character
RGV Shiva
Shiva re-release
Telugu film industry
Ram Gopal Varma interview
Shiva movie analysis

More Telugu News