Anjan Kumar Yadav: అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పొన్నం సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు

Anjan Kumar Yadav Upset Congress Leaders Visit
  • పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్న అంజన్ కుమార్
  • కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టడమేమిటని ప్రశ్న
  • పార్టీలో తాను చాలా సీనియర్ నాయకుడినన్న అంజన్ కుమార్
  • అంజన్ కుమార్ పోటీలో ఉండాలని చాలామంది భావించారన్న పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. టిక్కెట్‌ను నవీన్ యాదవ్‌కు కేటాయించాల్సిన పరిస్థితులను వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందానని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తనను ఇప్పుడు పక్కన పెట్టడం బాధాకరమన్నారు. తాను పార్టీలో చాలా సీనియర్ నాయకుడినని, ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ అందరూ కలిసి ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఆ తర్వాత కరోనాతో వెంటిలెటర్‌పై చికిత్స చేయించుకున్నానని గుర్తు చేశారు.

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని అంజన్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టానని, రెండుసార్లు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ పోటీ చేయాలని చాలామంది భావించారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, అధిష్ఠానం మరొకరికి టిక్కెట్ కేటాయించిందని చెప్పారు. నగరంలో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ పెద్ద దిక్కుగా ఉన్నారని ఆయన కొనియాడారు. అంజన్ నాయకత్వంలోనే ఎన్నికల్లో పార్టీ ముందుకు వెళుతుందని, జూబ్లీహిల్స్‌లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Anjan Kumar Yadav
Jubilee Hills by election
Ponnam Prabhakar
Telangana Congress

More Telugu News