Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి పేరు చెప్పి రూ.18 కోట్ల మోసం..నిలదీస్తే దాడి!

Hyderabad Woman Cheats Crores Using Chevireddys Name Then Attacks Victims
  • డబుల్ ఇస్తామని నమ్మించి గృహిణుల నుంచి డబ్బు, బంగారం వసూళ్లు
  • డబ్బులు తిరిగివ్వమని అడిగిన బాధితులపై కుటుంబంతో కలిసి దాడి
  • సుత్తి, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలు
  • హైదరాబాద్ పటాన్‌చెరులో వెలుగు చూసిన దారుణ ఘటన
  • ప్రధాన నిందితురాలు విద్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఓ మహిళ, డబ్బులు తిరిగివ్వమని అడిగిన బాధితులపై తన కుటుంబ సభ్యులతో కలిసి దాడికి దిగిన దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. మోసపోయామని గ్రహించి, న్యాయం కోసం వెళ్లిన మహిళలపై సుత్తి, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన విద్య అనే మహిళ ఈ మోసానికి సూత్రధారి. సుమారు రెండేళ్ల క్రితం, తాను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండతో కంటెయినర్ల వ్యాపారం చేస్తున్నానని స్థానిక గృహిణులను నమ్మించింది. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే పెట్టిన డబ్బుకు రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తానని ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మిన ఎంతో మంది మహిళలు తమ వద్ద ఉన్న లక్షలాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను కూడా ఆమెకు అప్పగించారు. ఈ విధంగా సుమారు రూ.18 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

కొంత కాలం తర్వాత బాధితులకు అనుమానం రావడంతో విద్యను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె సీతాఫల్‌మండిలోని ఇంటిని ఖాళీ చేసి, పటాన్‌చెరు సమీపంలోని ఏపీఆర్‌ గ్రాండియా కాలనీలోని ఓ విల్లాకు తన నివాసాన్ని మార్చింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న బాధితులు గురువారం అక్కడికి వెళ్లి తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో విద్య, ఆమె భర్త దిద్ది రాజశేఖర్‌, అతని సోదరులు రంజిత్‌, శివ, నిఖిల్‌, విద్య కుమారుడు అభి, ఇంట్లో పనిచేసే స్వప్న కలిసి బాధితులపై కర్రలు, సుత్తి, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కళమ్మ అనే మహిళ తలకు బలమైన గాయమైంది. అనంతరం బాధితులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Chevireddy Bhaskar Reddy
YSRCP
Hyderabad
financial fraud
attack
Seethaphalmandi
Patancheru
container business

More Telugu News