Deepika Padukone: హీరోలకు ఒక రూల్, మాకో రూలా?... పనివేళలపై దీపికా పదుకొణే సంచలన వ్యాఖ్యలు!

Deepika Padukone on work culture double standards in film industry
  • ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2' నుంచి తప్పుకున్న దీపికా పదుకొణే
  • ఇండస్ట్రీలోని పనివేళలపై తొలిసారిగా స్పందన
  • చాలా మంది హీరోలు రోజుకు 8 గంటలే పని చేస్తారన్న దీపిక
  • ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించనని వెల్లడి
  • నా పోరాటాలు నిశ్శబ్దంగానే ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్య
బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణే ఇటీవల ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులైన ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ 2’ నుంచి వైదొలగడంపై జరుగుతున్న చర్చకు తనదైన శైలిలో పరోక్షంగా సమాధానమిచ్చారు. చిత్ర పరిశ్రమలోని పనివేళలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తనకు ఇబ్బందిగా అనిపించిన ఏ ప్రాజెక్టునూ అంగీకరించనని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... “భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు కొన్ని సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసి, వారాంతాల్లో పూర్తిగా సొంత పనులకు సమయం కేటాయిస్తారు. కానీ, ఈ విషయం ఎప్పుడూ పెద్ద వార్త అవ్వలేదు” అని ఆమె వివరించారు. ప్రభాస్ చిత్రాల గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, పని గంటల విషయంలోనే తాను ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు ఆమె మాటలు సూచిస్తున్నాయి.

“న్యాయం కోసం పోరాడినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారా?” అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు. నా పోరాటాలు చాలా వరకు నిశ్శబ్దంగానే సాగుతాయి. గౌరవంగా ఉండాలంటే మౌనంగా పోరాడటం నేర్చుకోవాలి” అని ఆమె పేర్కొన్నారు. రెమ్యునరేషన్ కారణంగానే సినిమాల నుంచి వైదొలగారంటూ వచ్చిన వార్తలపై మాత్రం ఆమె స్పందించలేదు.

ప్రస్తుతం దీపికా పదుకొణే తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంతో పాటు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కలయికలో రానున్న పాన్-ఇండియా సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాలతో ఆమె కెరీర్ మరింత ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Deepika Padukone
Deepika Padukone movies
Prabhas
Kalki 2898 AD
Spirit movie
Bollywood actress
Indian film industry
Allu Arjun
Atlee movie
Movie working hours

More Telugu News