India vs West Indies: ఢిల్లీ టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... క్లీన్‌స్వీప్‌పై గురి

Shubman Gill wins toss India opts to bat in Delhi Test
  • వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్
  • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ గిల్
  • వరుసగా ఆరు టాస్‌ల ఓటమి పరంపరకు ఫుల్‌స్టాప్
  • సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యం
  • ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో గిల్‌ను గత కొంతకాలంగా వెంటాడుతున్న టాస్‌ల దురదృష్టానికి తెరపడింది. గత ఆరు మ్యాచ్‌లలో వరుసగా టాస్ ఓడిపోయిన గిల్, ఈసారి గెలిచి టాస్‌ల ఓటమి పరంపరకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది.

ఇప్పటికే తొలి టెస్టులో ఇన్నింగ్స్, 140 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు రోస్టన్ చేజ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

అయితే, ఢిల్లీ పిచ్ వారికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఇక్కడి నల్లమట్టి పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా సహకరిస్తుందని అంచనా. దీంతో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన భారత నాణ్యమైన స్పిన్ దళాన్ని ఎదుర్కోవడం విండీస్ బ్యాట్స్‌మెన్‌కు కత్తిమీద సాములాంటిదే. టాస్ గెలవడంతో భారత్ భారీ స్కోరు చేసి, ఆ తర్వాత ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించాలని భావిస్తోంది.

వెస్టిండీస్ XI:  జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్. 

ఇండియా XI:  యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
India vs West Indies
Shubman Gill
Delhi Test
Arun Jaitley Stadium
Cricket
Test Match
Ravindra Jadeja
Kuldeep Yadav
Washington Sundar
K L Rahul

More Telugu News