AP Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా విశాఖ.. ప్రపంచంలోనే ఏపీ నంబర్ వ‌న్‌!

Visakhapatnam to Lead Andhra Pradesh as Top Data Center Hub
  • విశాఖ కేంద్రంగా భారీ డేటా సెంటర్ల ఏర్పాటు
  • ప్రపంచంలోనే ఏపీ నంబర్ 1 స్థానానికి చేరే అవకాశం
  • గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజాల భారీ పెట్టుబడులు
  • రానున్న ఐదేళ్లలో లక్షన్నర మందికి ఉద్యోగాలు
  • ఈ నెల 14న ఢిల్లీలో కీలక అధికారిక ప్రకటన
  • రేపే విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు భూమి పూజ
డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ ప్రపంచ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఐటీ దిగ్గజాలైన గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖ సాగర తీరంలో భారీ పెట్టుబడులు పెట్టనుండటంతో రాష్ట్రం త్వరలోనే అంతర్జాతీయ హబ్‌గా మారనుంది. ఈ పరిణామంతో రానున్న ఐదేళ్లలో ఏకంగా లక్షన్నర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలోని వర్జీనియా 1.3 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఒక్క విశాఖపట్నంలోనే టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్, సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో విశాఖ మొత్తం సామర్థ్యం 3.5 గిగావాట్లకు చేరి, వర్జీనియాను అధిగమించి ప్రపంచంలోనే ఏపీని అగ్రగామిగా నిలపనుంది.

ఈ దిశగా కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ ప్రతినిధులు తమ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు సిఫీ సంస్థ తన 450 మెగావాట్ల డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు రేపు విశాఖలో భూమి పూజ నిర్వహించనుంది.

గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ దాదాపు రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో అచ్యుతాపురం, అడవివరం, తుర్లవాడ ప్రాంతాల్లో 500 ఎకరాల్లో మూడు దశల్లో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనుంది. ఈ పెట్టుబడి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఇవాళ ఆమోదముద్ర వేయనుంది. కాగా, నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టీసీఎస్ ప్రతినిధులు, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు.
AP Data Centers
Chandrababu Naidu
Andhra Pradesh data centers
Visakhapatnam
Google
TCS
Nara Lokesh
IT sector Andhra Pradesh
Ryden Infotech
Sify data center
data center investments India

More Telugu News