Vijay: విజయ్ మళ్లీ అక్కడికి వెళితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు!: తమిళనాడు బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Vijays Life in Danger if He Visits Karur Says BJP Chief
  • కరూర్ సభ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై వివాదం
  • బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నాలు
  • తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ స్పందన 
  • డీఎంకే ప్రభుత్వంపైనా, ఎన్నికల సంఘంపైనా బీజేపీ నేత విమర్శలు
  • విజయ్ పర్యటనకు అనుమతిపై పోలీసుల పరిశీలన
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్, "విజయ్ ఇప్పుడు కరూర్ వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు" అని తెలిపారు. 

సెప్టెంబర్ 27న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థనను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి, వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. "ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయి" అని ఆయన అన్నారు.

కాగా, కరూర్ దుర్ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Vijay
Tamil Nadu BJP
Nainar Nagendran
Karur
stampede
Tamilaga Vettri Kazhagam
TVK
Tamil Nadu politics
DMK government

More Telugu News